'బంపర్ ఆఫర్' రివ్యూ
దర్శకుడు జయ రవీంద్ర ముందే చెప్పినట్టుగా 'పూరీ స్టయిల్ ఆఫ్ నేరేషన్'లోనే కథను నడపడం వల్ల ఆయన పెద్దగా చెప్పగలిగింది ఏమీ లేకపోయింది. నిజానికి కథలో బోలెడంత వినోదానికి స్కోప్ ఉంది. అయితే కథాగమనం కొద్దిపాటి నవ్వులకే పరిమితమైంది. కామెడీ ట్రాక్ సరైన పంథాలో సాగకపోవడం ఇందుకు ఓ కారణం. సినిమా ఎత్తుగడ, విశ్రాంతి కార్డ్ పంచ్ ఫవర్ ఫుల్ గా ఉన్నప్పటికీ ఆ తర్వాత నడక తేలిగ్గా ఊహించేయవచ్చు. సాయాజీ షిండేని పాపర్ చేసేందుకు హీరో సాయిరాం వేసిన ఎత్తుగడలు చాలా సినిమాల్లో జనం చూసేశారు. ఐటెం సాంగ్ కోసం ఓ సన్నివేశం సృష్టించడం షరామామూలు జిమ్మిక్కే.
హీరో సాయిరాం శంకర్ ఆహార్యంలో మార్పులు చోటుచేసుకున్నప్పటికీ నటనను మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. డాన్స్ లు, ఫైట్స్ లో ఉన్న ఈజ్ సంభాషణలు పలకడంలో కనిపించడం లేదు. మేకప్ వెలవెల బోయింది. పదహారణాల తెలుగమ్మాయి బిందు మాధవి గ్లామర్ తళుకులీనింది. తొలి చిత్రం 'ఆవాకాయ్ బిర్యానీ'లో విలేజ్ గాళ్ గా కనిపించిన బిందు ఈ చిత్రంలో గ్లామర్ పుంతలు తొక్కింది. యువతరం హీరోయిన్లకు సవాలు విసిరింది. అయితే గ్లామర్ గాళ్ గా కొనసాగాలనుకుంటే మాత్రం ఆహార్యాన్ని ట్రిమ్ చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. సాయాజీ షిండే, చంద్రమోహన్, రక్ష, కోవైసరళ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఆలీ, వేణుమాధవ్ ల 'మగధీర' పేరడీ ప్రారంభంలో కొద్దిపాటి నవ్వులు పూయించినా పోనుపోనూ వారిద్దరి ట్రాక్ విపరీత పోకడలకు పోయింది. ఇద్దరూ లింగమార్పిడి చేయించుకుని...ఇప్పుడు చేసేదేముంది? ఏ షేర్ ఖాన్ నో, సల్మాన్ నో తగులుకోవాలి అంటూ ఫైనల్ టచ్ ఇవ్వడం వైపరీత్యం కాకపోతే మరేమిటి? ఇలాంటి ట్రాక్ తో దర్శక-కథకులు ప్రేక్షకులకు ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు? పేరడీని పెడార్ధాలతో నింపడమే ఇవాల్టి హాస్యమని సరిపుచ్చుకోవాలా?. బాలనటుడు భరత్ రెడ్డి కేవలం రెండు మూడు సన్నివేశాల్లో కనిపించినా ఇరగదీశాడు. సీనియర్ కమెడియన్లకు ఈ చిచ్చరపడుగు ఇక పోటీనే.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|