నిర్మాతగా హీరో రాజా
హీరోలు నిర్మాతలుగా మారడం పరిపాటేననీ, ఒక్కోసారి సరైన బ్రేక్ కోసం సొంత చిత్రాలు తీస్తుంటారనీ, గతంలో స్టార్ హీరోలు సైతం ఇదే పని చేశారనీ దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు ఇటీవల 'తాజ్ మహల్' ఆడియో వేడుకలో చెప్పుకొచ్చారు. కొద్దికాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో శివాజీ 'తాజ్ మహల్' చిత్రంతో తొలిసారి నిర్మాతగా మారారు. ఇందులో హీరోగా నటిస్తూ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పుడు శివాజీ బాటలోనే మరో హీరో రాజా సైతం నిర్మాతగా మారబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తూ శ్రీ రాజా ఫిలిమ్స్ అనే సొంత బ్యానర్ పై ఓ కొత్త చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి సుమన్ పాతూరి దర్శకత్వం వహించనున్నారు.
రాజా హీరోగా సుమన్ పాతూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇంకోసారి' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఆడియో వేడుక గత బుధవారం సాయంత్రం తాజ్ బంజారా హోటల్ లో జరిగింది. ఈ సందర్భంగా సుమన్ పాతూరి దర్శక ప్రతిభను రాజా ప్రశంసించారు. కెరీర్ లో 30 వరకూ సినిమాలు చేసినప్పటికీ 'ఆనంద్', 'వెన్నెల' తర్వాత తనకు బాగా నచ్చిన చిత్రం 'ఇంకోసారి' అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే సుమన్ పాతూరి టాలెంట్ నచ్చిన రాజా 'ఇంకోసారి' ఆయన దర్శకత్వంలో పనిచేయాలని అభిలషించారు. దీనిని ఆయనే సొంతంగా నిర్మించతలబెట్టారు. కొత్త సంవత్సరంలో ఈ చిత్రం ప్రారంభమవుతుంది.
Be first to comment on this News / Article!
|