'రమ్మీ' ఆఖరి రౌండ్
'కింగ్' సక్సెస్ తర్వాత నాగార్జున హీరోగా కామాక్షి కళామూవీస్ పతాకంపై అన్నపూర్ణా స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటూ చివరి షెడ్యూల్ లోకి అడుగుపెట్టింది. కిరణ్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ డి.శివప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే గోవాలో భారీ షెడ్యూల్ జరిగింది. తాజా షెడ్యూల్ హైద్రాబాద్ లోని ఓ ప్రైవేటు భవంతిలో ప్రస్తుతం జరుగుతోంది. నాగార్జున, మమతామోహన్ దాస్, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి తొలుత 'ఇస్పేట్ రాజా' అనే టైటిల్ పరిశీలనలోకి వచ్చినప్పటికీ తాజాగా 'రమ్మీ' అనే టైటిల్ కు చిత్రయూనిట్ మొగ్గుచూపుతోందని సమాచారం.
ప్రస్తుతం జరుగుతున్న చివరి షెడ్యూల్ డిసెంబర్ 3 వరకూ ఏకథాటిగా జరుగుతుందనీ, దీంతో షూటింగ్ పూర్తవుతుందనీ తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున ఇంతవరకూ నటించని వైవిధ్యమైన భూమికను పోషిస్తున్నారనీ, ఆయన కెరీర్ లోనే ఈ చిత్రం ఓ మైలురాయి అవుతుందనీ నిర్మాత శివప్రసాద్ రెడ్డి చెబుతున్నారు. మాస్ అంశాలతో కూడిన ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోంది. ఈ చిత్రంలో అమెరికా అమ్మాయి లిండా ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తోంది. నాగార్జునకు ఉన్న డిసెంబర్ సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకుని క్రిస్మస్-సంక్రాంతి పండుగలు కలిసొచ్చేలా సినిమా రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సాయాజీ షిండే, అంకుర్, బ్రహ్మానందం, హర్షవర్దన్ తదితురుల నటిస్తున్నారు. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ, సెల్వం ఫైట్స్, సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు. అక్కినేని వెంకటరత్నం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|