మోహన్ బాబు సినిమానా?
విలక్షణ నటుడుగా, నిర్మాతగా డాక్టర్ మోహన్ బాబు ఎప్పుడూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ ఉంటారు. నలుగురిలో కూర్చుని ఆయన గంభీర ముద్ర దాలిస్తే అందరి గుండెలు దడదడలాడతారు. ఆయన ఎవరిపై, ఎలాంటి వాగ్భాణాలు సంధిస్తారోనని ఎదురుచూసే వాళ్లూ ఉన్నారు. 'సిల్లీ ఫెలో..' అని వేలెత్తి చూపినా, 'ప్రజలు క్షమించరు' అని ఘాటుగా విమర్శించినా ఆయన రూటే సెపరేట్. అలాగే ఆయన కుటుంబం నుంచి వచ్చిన వారంతా సినీ పరిశ్రమలోనే కొనగుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, ఉషాకిరణ్ మూవీస్ తర్వాత అత్యధిక సినిమాలు నిర్మించిన క్రెడిట్ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ దే. నాటి 'ప్రతిజ్ఞ' నుంచి నేటి 'సలీమ్' వరకూ 53 చిత్రాలను మోహన్ బాబు నిర్మించారు. పలువురు హీరోయిన్లను పరిచయం చేశారాయన. అంతా బాగానే ఉన్నా...మోహన్ బాబు సినిమాల్లో నటించేందుకు ముందుకు వచ్చిన హీరోయిన్లను పరిశ్రమలో కొందరు బెదర గొడుతున్నారట. మోహన్ బాబు సినిమానా? అంటూ బెంబేలెత్తిస్తున్నారట. ఈ విషయాన్ని మోహన్ బాబు స్వయంగా 'సలీమ్' ఆడియో వేడుకలో ప్రస్తావించి కాసేపు సందడి సృష్టించారు.
'శ్రీ లక్ష్మీప్రసన్న ఓ ప్రిస్టేజియస్ బ్యానర్. ఎందరెందరో హీరోయిన్లు నటించారు. పారితోషికం ఇవ్వడం దగ్గరనుంచి రెస్పెక్ట్ ఇవ్వడం వరకూ ఎప్పుడూ మేము ముందున్నాం. పరిశ్రమలో కొందరు మోహన్ బాబు సినిమానా అంటూ హీరోయిన్లను భయపెట్టడంలో సహేతుకత ఎంతమాత్రం లేదు. అంతెందుకు? కృష్ణార్జున సినిమాలో మమతా మోహన్ దాసు నటించింది. ఇప్పుడు మా సినిమాలో ఆమె లేదు. అయినప్పటికీ సలీమ్ ఆడియో ఫంక్షన్ కు ఆమె హాజరైంది. మేము హీరోయిన్లకు ఇచ్చే గౌరవం ఎలాంటిందో ఆ ఒక్క ఉదాహరణ చాలు' అంటూ మోహన్ బాబు నవ్వుతూ వివరణ ఇచ్చారు. ఇంతకూ హీరోయిన్లను భయపెడుతున్న 'ఆ కొందరు' ఎవరో ఆయన చెప్పనేలేదు.
Be first to comment on this News / Article!
|