దయానాయక్ స్ఫూర్తితో...
క్రియేటివ్ డైరెక్టర్ గా తనకున్న ఇమేజ్ ను కాపాడుకునేందుకు పూరీ జగన్నాథ్ ఎప్పటికప్పుడు క్రేజీ ప్రాజెక్ట్ లతో ముందుకు వస్తున్నారు. సినీ పరిశ్రమ లోగుట్టు ను వివరిస్తూ ఆయన తీసిన 'నేనింతే' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్ సక్సెస్ కు నోచుకోలేదు. అయితే ఆ సినిమాకి 'నందులు' రావడం పూరీకి ఊరట. హైప్ పెరిగిపోవడం వల్లనే ఏమో కానీ పూరీ తాజా చిత్రం 'ఏక్ నిరంజన్' బాక్సాఫీస్ దగ్గర విలవిలలాడుతోంది. అయితే నిర్మాతగా ఆయనకు ఒకింత ఊరట కలిగిస్తూ తన సోదరుడు సాయిరాం శంకర్ తో తీసిన 'బంపర్ ఆఫర్' హిట్ జోన్ లోకి వెళ్లింది. 'ఏక్ నిరంజన్' అనుభవంతో పూరీ జగన్నాథ్ ఈసారి మరింత కేర్ ఫుల్ గా 'గోలీమార్' చిత్రానికి కట్టుదిట్టమైన స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. గోపీచంద్ కథానాయకుడుగా వైష్ణో అకాడమీ పతాకంపై పూరీ జగన్నాథ్ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో గోపీచంద్ తొలిసారి ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా నటించబోతున్నారు. ఆయన పాత్ర రూపకల్పనకు ప్రముఖ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ చరిత్ర స్ఫూర్తి అని తెలుస్తోంది.
దయానాయక్ ముంబై పోలీసు ఫోర్స్ కు చెందిన సబ్ ఇన్ స్పెక్టర్. అండర్ వరల్డ్ లూటీలు, గ్యాంగ్ వార్స్, శాంతిభద్రతల సమస్యను ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'ముంబై ఎన్ కౌంటర్ స్క్వాడ్' లో మెంబర్ గా 83 మంది గ్యాంగ్ స్టర్లను ఎన్ కౌంటర్లలో మట్టుబెట్టారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై ఓ మాజీ క్రిమినల్ ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు కావడంతో అప్పట్లో ఆయనను సస్పెండ్ చేశారు. అయితే అలాంటి ఆస్తులు ఉన్నట్టు అవినీతి నిరోధక విభాగం నిరూపించలేకపోయింది. ప్రస్తుతం సస్పెన్సస్ కొనసాగుతున్నప్పటికీ తిరిగి ఆయన డ్యూటీలో చేరేందుకు ఎదురుచూస్తున్నారు. పూరీ జగ్నన్నాథ్ సినిమాకి కావాల్సినంత కథావస్తువు ఇందులో ఉండటంతో దయానాయక్ ప్రొఫెషనల్ లైఫ్ కు గురించి మరింత కూలంకషంగా ఆయన అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది. గోపీచంద్ కు జోడిగా హన్సిక నటించనుంది. ఈ చిత్రానికి తొలుత కుంచె రఘును సంగీత దర్శకుడిగా అనుకున్నప్పటికీ కారణాంతరాల వల్ల చక్రిని పైనలైజ్ చేశారు. చక్రి-పూరీ కాంబినేషన్ లో 'ఇడియట్', 'అమ్మ నాన్న ఓ తెలుగు అమ్మాయి', 'దేశముదురు' వంటి మ్యూజికల్స్ హిట్స్ ఉన్నాయి. డిసెంబర్ లో 'గోలిమార్' షూటింగ్ ప్రారంభించి 2010 ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు పూరీ జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|