నవ్వుల ప్యాకేజీ 'అదుర్స్'
శ్రీనువైట్ల స్టైల్ ఆఫ్ మేకింగ్ ఇప్పుడు టాలీవుడ్ లో కాసులు పండిస్తోంది. మాస్ అంశాలతో పక్కా కమర్షియల్ చిత్రాలు అందించే వి.వి.వినాయక్ సైతం ఇటీవల తన రూటు మార్చి హిలేరియస్ ఎంటర్ టైనర్ గా 'కృష్ణ' చిత్రాన్ని అందించి హిట్ కొట్టారు. శ్రీనువైట్ల తరహాలో సినిమా ఉందని అప్పట్లో అందరూ అన్నా సక్సెస్ ఒక్కటే ఎవరికైనా మూలసూత్రం అవుతుంది కాబట్టి వినాయక్ రూట్ మార్చడం ఆశ్చర్యం అనిపించదు. ఇప్పుడు వి.వి.వినాయక్ తన 'అదుర్స్' చిత్రం విషయంలోనూ ఇదే లైన్స్ ఫాలో అయ్యారనీ, సినిమా ప్రథమార్థమంతా నవ్వుల జల్లులు కురుస్తున్నాయనీ, సెకెండాఫ్ వినాయక్ స్టైల్ లో యాక్షన్ ప్యాక్డ్ సన్నివేశాలుంటాయనీ యూనిట్ వర్గాల కథనం.
వినాయక్ కాంబినేషన్ లో తాను నటించిన 'ఆది' పక్కా మాస్ ఫిల్మ్ అయితే, 'సాంబ' ఎడ్యుకేషన్ చుట్టూ అల్లుకున్న కథనీ, ఇప్పుడు వస్తున్న 'అదుర్స్' ఫుల్ ఎంటర్ టైనర్ అనీ ఎన్టీఆర్ ఇటీవల ఆడియో ఫంక్షన్ లో వెల్లడించారు. ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునే అంశాలు ఇందులో ఉంటాయనీ, ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందనీ చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. వినాయక్ సైతం 'అదుర్స్' చిత్రం ఫైనల్ రిజల్ట్ చూసి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే తొలిసారి 900 థియేటర్లలో ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 'మగధీర' రికార్డులు టార్గెట్ గా 'అదుర్స్' ఉండబోతోందని సినీ వర్గాల భోగట్టా. డిసెంబర్ మొదటి వారంలో ఆడియో, మూడోవారంలో (18వ తేదీ కావచ్చు) సినిమా రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ కు జోడిగా నయనతార, షీలా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, తనికెళ్ భరణి, మహేష్ మంజ్రేకర్, నాజయర్, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, ముకుల్ దేవ్, సుప్రీత్, రమాప్రభ తదితరులు నటించారు. వైష్ణమీ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొడాలి నాని సమర్పణలో వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. కోన వెంకట్ కథ-మాటలు, చంద్రబోస్-కులశేఖఱ్-రామజోగయ్య శాస్త్రి పాటలు, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|