ఫిబ్రవరి 14న 'మా' క్రికెట్
సినీ పరిశ్రమలోని పేద కళాకారుల సహాయార్థం మూవీ ఆర్టిస్ట్స్ అస్సోయేషన్ (మా) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14న స్టార్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. 'మా ప్రీమియర్ లీగ్ టి20 కప్' పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. హైద్రాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ విశేషాలను ఓ ప్రెస్ మీట్ లో తెలియజేశారు.
'మా' అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ, సినిమా రంగంలో ఏ రోజు సంపాదనతో ఆరోజు బతికే వారు 90 శాతం మంది ఉన్నారనీ, వారి కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో చేపడుతున్న కార్యక్రమం ఇదని చెప్పారు. స్టార్ నైట్ ఏర్పాటు చేసిన అతి తక్కువ సమయంలోనే పరిశ్రమలోని అన్ని శాఖల వారు సహకరించారనీ, ఇప్పుడు 'మా' కోసం చేపడుతున్న ఈ క్రికెట్ మ్యాట్ కు కూడా అందరి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. 'మా'లో 900 మంది సభ్యులు ఉండగా, వారిలో ఎక్కువ మంది పేద కళాకారులేననీ, వారిని ఆదుకునేందుకు నిధులు అవసరమైనందున ఈ స్టార్ క్రికెట్ నిర్వహిస్తున్నామని అన్నారు. జనవరిలో క్రికెటర్ల డ్రెస్ లు రిలీజ్ చేస్తామనీ, మరిన్ని వివరాలు తదుపరి సమావేశంలో వెల్లడిస్తామనీ అన్నారు. నటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, సినిమాలు తగ్గి ఎందరో కళాకారులు ఇబ్బందుల్లో ఉన్నాయనీ, వారి సహాయార్థం ఈ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నామనీ చెప్పారు. ఇందులో మొత్తం నాలుగు టీమ్ లు ఉంటాయనీ, ఏ టీమ్ కు ఎవరు కెప్టెన్ గా ఉండారనే వివరాలన్నీ త్వరలోనే తెలియజేస్తామనీ అన్నారు. 'మా' సొంత బిల్డింగ్ ఏర్పాటు, సభ్యుల కోసం ఒక క్లినిక్ ఏర్పాటు చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నామనీ, ఈ ఈవెంట్ ను పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాననీ అన్నారు. ఈ సందర్భంగా 'మా ప్రీమియర్ లీగ్ టి20 కప్' లోగోను బాలకృష్ణ, నటి-ఎమ్మెల్యే శ్రీమతి జయసుధ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విష్ణు, కల్యాణ్ రామ్, తారకరత్న, శ్రీకాంత్, ఆలీ, శివాజీరాజా, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, ఓ.కల్యాణ్, అశోక్ కుమార్, రాజారవీంద్ర, శివకృష్ణ,స హేమ, కాదంబరి కిరణ్ కుమార్, బెంగుళూరు పద్మ, విఆర్ కె ఈవెంట్ కు చెందిన వి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|