జనవరిలో సీతారాములకళ్యాణం
నితిన్, హన్సిక జంటగా వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై విజయ్ ప్రసాద్ మళ్ల నిర్మిస్తున్న చిత్రం 'సీతారాముల కళ్యాణం'. దీనికి 'లంకలో' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఈశ్వర్ దర్శకుడు. రెండు పాటల చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తయింది. 2010 జనవరి 8న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
మిథిలా నగరం, భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం జరగడం మనం విన్నామనీ, అయితే ఇందుకు భిన్నంగా సీతారాముల కళ్యాణం లంకలో జరుగుతుందనీ, అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేననీ దర్శకుడు ఈశ్వర్ తెలిపారు. వైవిధ్యమైన కథ-కథనాలతో చక్కటి కమర్షియల్ హంగులతో ఈ చిత్రం తెరకెక్కుతోందనీ, అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుందనీ చెప్పారు. పేరుకు తగ్గట్టే చాలా హోమ్లీగా ఈ చిత్రం ఉంటుందని నితిన్ తెలిపారు. కుటుంబ బంధాలు, యూత్ ఫుల్ అంశాలు, మాస్ మసాలా ఐటమ్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయని అన్నారు. దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంతో కాన్ఫిడెంట్ గా తెరకెక్కిస్తున్నారనీ, అలాగే హన్సిక పాత్రకు కూడా చక్కటి ప్రాధాన్యం ఉంటుందనీ ఆయన చెప్పారు. తమ జంట ప్రేక్షకులకు కనులవిందు చేస్తుందన్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి వైజాగ్, అరకు ప్రాంతాల్లో బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలు చిత్రీకరించనున్నట్టు నిర్మాత తెలిపారు. డిసెంబర్ 19న వైజాగ్ లో ఆడియో విడుదల చేసి, జనవరి 8న సినిమా విడుదల చేస్తామని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్నరు. తోట ప్రసాద్ మాటలు, ఎం.జోషి సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|