నచ్చిన అమ్మాయితో బన్నీ పెళ్లి!
టాలీవుడ్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడైన స్టయిలిష్ హీరో అల్లు అర్జున్ కు కాబోయే అమ్మాయి ఎలా ఉండాలి? అతనికి నచ్చిన అమ్మాయితోనే పెళ్లికి పెద్దలు ఓకే చేస్తారా? ఇవాల్టి బన్నీ ఎదుగులలో ఆయన స్వయంకృషి ఎంత? అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలని చాలామందికే ఉంటుంది. అల్లు అర్జున్ తల్లి శ్రీమతి నిర్మల ఈ ఆసక్తికరమైన విశేషాలను ఓ పాపులర్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముచ్చటించారు.
'నా కుమారుడు మంచి జమ్నాస్ట్ కూడా. ఆ విషయం చాలా మందికి తెలియదు. యానిమేషన్ కోర్సులోనూ శిక్షణ పూర్తి చేశాడు. స్టడీస్ కొనసాగేంచేందుకు కెనడా వెళ్లాలని ప్లాన్ చేశాడు. అయితే గంగోత్రి చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. ఏదో ఒకరోజు అతను ఫిల్మ్ స్టార్ అవుతాడని మాత్రం నేనెప్పుడూ అనుకోలేదు' అంటూ నిర్మల తెలిపారు. మొదట్లో తన కుమారుడు ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయనీ, అయితే అతనెప్పుడూ నిరుత్సాహానికి గురికాలేదనీ అన్నారు. తండ్రి పలుకుబడిని ఉపయోగించుకోవడం కానీ, ఆయన సహాయం అడగడం కానీ ఎప్పుడూ తన కుమారుడు చేయలేదనీ, ఇవాళ అతను హీరోగా ఒక మంచి ప్లేస్ లో ఉన్నాడంటే అదంతా అతని సొంత కష్టమేననీ ఆమె చెప్పుకొచ్చారు. బన్నీ వివాహం గురించి ముచ్చటిస్తూ 'నచ్చిన భగస్వామిని ఎన్నుకునే స్వేచ్ఛ అతనికి ఉంది. మావైపు నుంచి ఎలాంటి అభ్యంతరాలు, షరతులు ఉండవు. తనకు ఏ అమ్మాయి అయితే సరిపోతుందని అనుకుంటాడో ఆమెను నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు. ఆ అమ్మాయి మా అందరితో కలిసిపోయేలా ఉండే చాలు. అంతకుమించి ఆ అమ్మాయి నుంచి కూడా ఏమీ కోరుకోం' అంటూ నవ్వుతూ చెప్పారు. తల్లి మనోగతంపై అల్లు అర్జున్ స్పందిస్తూ, తన తల్లిదండ్రులు ఏ సందర్భంలోనూ తనను నిరోధించే ప్రయత్నం చేయలేదనీ, కనీసం తనకు వచ్చే మెయిల్స్ చూడడానికి కూడా ఎప్పుడూ ప్రయత్నించ లేదనీ చెప్పారు. తాను కూడా తన హద్దులు ఎప్పుడూ దాటలేదనీ చెప్పారు. తన మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ కుటుంబానికేననీ, ఆ తర్వాత మిత్రులకు ఉంటుందనీ, షూటింగ్ పూర్తి కాగానే ఇంటికి నేరుగా వచ్చి ఆ తర్వాతే ఫ్రెండ్స్ గురించి, షాపింగ్ చేయడం గురించి ఆలోచిస్తాననీ చెప్పుకొచ్చారు. మనసెరిగిన తల్లిదండ్రులు, హద్దులు తెలిసిన కొడుకు ఉంటే అంతకంటే హ్యాపీ ఫ్యామిలీ ఉండదు మరి...
Be first to comment on this News / Article!
|