నారా హీరోతో బెల్లంకొండ
నారా చంద్రబాబునాయుడు సోదరుడైన నారా రామ్మూరి నాయుడి తనయుడు రోహిత్ హీరోగా మరో కొత్త చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. త్రీ ఏంజెల్స్ స్టూడియో పతాకంపై శేషు ప్రియాంక చలసాని నిర్మాతగా చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన 'బాణం' చిత్రం ద్వారా ఇటీవల రోహిత్ హీరోగా పరిచయమయ్యారు. ఇందులో ప్రభుత్వాన్ని గడగడలాంచి ఆ తర్వాత జీవనస్రవంతిలోకి వచ్చిన ఓ నక్సలైట్ కొడుకుగా, ఐపిఎస్ కావాలనే పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన యువకుడి పాత్రలో రోహిత్ నటన ప్రశంసలు అందుకుంది. మాస్ హీరోకి కావల్సిన చక్కటి ఫిజిక్ ఉన్న రోహిత్ ఈసారి పక్కా కమర్షియల్ ఫిల్మ్ లో కనిపించబోతున్నారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే రోహిత్ కు అడ్వాన్ కూడా ఇచ్చిన బెల్లంకొండ ఈ చిత్రం కోసం ప్రముఖ దర్శకులను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం రవితేజ, అల్లరి నరేష్ తదితరులతో 'శంభో శివ శంభో' అనే మల్టీస్టారర్ చిత్రాన్ని సుముద్రఖని దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. రవితేజతోనే కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ చిత్రం లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకొని రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లాల్సి ఉంది. తాజాగా నారా రోహిత్ సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Be first to comment on this News / Article!
|