జగపతి 'గాయం-2' షురూ
హీరో జగపతిబాబు నటించిన 'గాయం' చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. 1993లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జగపతిబాబు కెరీర్ కు మంచి టర్నింగ్ అయింది. రేవతి, ఊర్మిళ మటోండ్కర్ తదితరులు ఆ చిత్రంలో నటించారు. ఇందులోని 'దుర్గ' పాత్ర జగపతిబాబుకు మంచి పేరు తెచ్చింది. పదిహేనేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా 'గాయం-2' రాబోతోంది. జగపతిబాబు కథానాయకుడుగా రామ్ గోపాల్ వర్మ శిష్యుడు ప్రవీణ్ శ్రీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కర్త క్రియేషన్స్ బ్యానర్ లో ధర్మ కర్త ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలను ఫిలిం నగర్ లోని దైవ సన్నిధానంలో ప్రచారార్భాటాలకు దూరంగా జరిపారు. సీనియర్ నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు, దర్శకనిర్మాతలు పాల్గొన్నారు. వి.బి.రాజేంద్రప్రసాద్ ఈ చిత్రం స్క్రిప్టును నిర్మాతకు అందజేశారు.
జగపతిబాబుతో పాటు ఈ చిత్రంలో రేవతి, కోట శ్రీనివాసరావు తదితరులు నటించనున్నారనీ, ఊర్మిళను సంప్రదించాల్సి ఉందనీ తెలుస్తోంది. ఈ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి హైద్రాబాద్, వైజాగ్ లలో షూటింగ్ జరుపనున్నారు. విదేశాల్లో కూడా షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారు. 2010 ఏప్రిల్ లో ఈ చిత్రం విడుదలవుతుంది.
Be first to comment on this News / Article!
|