'గోలీమార్' మొదలైంది...
గోపీచంద్ కథానాయకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం 'గోలీమార్'. ఈ చిత్రం చిత్రం పూజా కార్యక్రమాలు వైష్ణో అకాడమీ కార్యాలయంలో శుక్రవారంనాడు జరిగాయి. సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరీ జగన్నాథ్, గోపీచంద్, బెల్లంకొండ సురేష్, చిత్ర సంగీత దర్శకుడు చక్రి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
పూరీ జగన్నాథ్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ, బెల్లంకొండ సురేష్ తనకు మంచి మిత్రుడనీ, ఆయన బ్యానర్ లో పనిచేస్తుండటం తనకు సంతోషంగా ఉందనీ చెప్పారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవిత కథ స్ఫూర్తితో ఈ చిత్రం ఉంటుందనీ, టైటిల్ పాత్రను పోషిస్తున్న గోపీచంద్ కు ఈ చిత్రంతో మంచిపేరు వస్తుందనీ చెప్పారు. ఈనెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని అన్నారు. పూరీ జగన్ తనకు పాతికేళ్లుగా తెలుసనీ, ఆయన దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం సంతోషంగా ఉందనీ బెల్లంకొండ సురేష్ పేర్కొన్నారు. ఇదొక యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెప్పారు. గోపీచంద్ మాట్లాడుతూ, తొమ్మిదేళ్లుగా తాను పరిశ్రమలో ఉన్నప్పటికీ పెద్ద దర్శకులతో పనిచేసే అవకాశం రాలేదనీ, తన సినిమాల బాధ్యత తనమీదే ఉండటంతో కొత్త దర్శకులకే ప్రాధాన్యం ఇస్తూ వచ్చాననీ చెప్పారు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో తాను చాలా రిలాక్స్ డ్ గా ఉన్నానని చెప్పారు. ఇందులో తనది పవర్ ఫుల్ పాత్ర అనీ, రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంటుందనీ చెప్పారు. ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయని చక్రి తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నాజర్, రోజ తదితరులు నటించనున్నారు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, విజయ్ ఫైట్స్ అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|