శ్రీహరి హీరోగా '100'
రియల్ స్టార్ శ్రీహరి మరోసారి ఖాకీ యూనిఫాం వేశారు. ఆయన పోలీసు పాత్రలో కథానాయకుడుగా నటిస్తున్న కొత్త చిత్రం '100'. దీనికి 'దేవుడొస్తాడు' అనే ట్యాగ్ లైన్ ఉంది. సుధ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై జి.ఎల్.శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పోలూరి శ్రీనివాస్ (గులాబీ) దర్శకుడు. ఈ కొత్త చిత్రం షూటింగ్ నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోస్ లో శుక్రవారంనాడు ప్రారంభమైంది. శ్రీహరిపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి డాక్టర్ దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఎస్.ఎస్.రాజమౌళి, శ్రీనువైట్ల సంయుక్తంగా గౌరవ దర్శకత్వం వహించారు.
శ్రీహరి మాట్లాడుతూ, '100' డయల్ చేయగానే పోలీసు వాహనం మనముందుకు వస్తుందనీ, ఎమర్జన్సీ సమయాల్లో డయల్ చేసినప్పుడు అక్కడకు చేరుకునే పోలీసులను చూడగానే జనం 'హమ్మయ్య...దేవుడొచ్చాడు' అని ఊపిరి పీల్చుకుంటారని అన్నారు. ఆ కాన్సెప్ట్ తోనే ఈ చిత్రం ఉంటుందనీ, నేరాలు చేసే వారికి ఈ సినిమా ఓ హెచ్చరిక అని చెప్పారు. గతంలో పలుమార్లు పోలీస్ పాత్రలో తాను నటించిన చిత్రాలు విజయవంతమయ్యాయనీ, ఆ కోవలోనే ఈ చిత్రానికి కూడా మంచి పేరు వస్తుందని తెలిపారు. నిర్మాత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఇదొక మంచి కమర్షియల్ చిత్రమనీ, జనవరి మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. మంచి కథాబలమున్న చిత్రమిదని దర్శకుడు పోలూరి శ్రీనివాస్ తెలిపారు. శ్రీహరి వంటి స్టార్ హీరోతో ఈ సినిమా చేస్తుండటం సంతోషంగా ఉందని అన్నారు. ఈ చిత్రానికి స్వామీజీ-విజయ్ మాటలు, అడుసుమిల్లి విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ, విజయ్ ఫైట్స్, ఆర్.మురళీధర్ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|