యువరత్న బాలకృష్ణతో శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న చిత్రానికి కథ సిద్ధమైంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో 'చెన్న కేశవరెడ్డి', 'లక్ష్మీనరసింహా' చిత్రాలు గతంలో రూపొందాయి. కొద్దిరోజులకు ముందే బాలకృష్ణ కాంబినేషన్ లో తన కొత్త చిత్రాన్ని బెల్లంకొండ ప్రకటించినప్పటికీ అది కార్యరూపంలోకి రాలేదు. 'భీష్మ' అనే టైటిల్ తో రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని బెల్లంకొండ ప్లాన్ చేశారు. అయితే కారణాంతరాల వల్ల బాలకృష్ణ 'సింహా' చిత్రం వైపు మళ్లారు. ఈ క్రమంలో బాలయ్య-బెల్లంకొండ కాంబినేషన్ చిత్రం ఇక ఉండదంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి బెల్లంకొండ తాజాగా తెరదించారు. బాలకృష్ణ సినిమాకి అద్భుతమై కథ సిద్ధమైనట్టు చెప్పారు.
ప్రస్తుతం బెల్లంకొడ సురేష్ చేతిలో వరుస ప్రాజెక్ట్ లు ఉన్నాయి. రవితేజ కథానాయకుడుగా సముద్రఖని దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న'శంభో శివ శంభో' చిత్రం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకొంటోంది. జనవరి 14న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. జనవరిలోనే రవితేజ-కృష్ణవంశీ కాంబినేషన్ చిత్రం సెట్స్ పైకి రానుంది. తాజాగా ఈనెల 20 నుంచి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడుగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న 'గోలీమార్' చిత్రం రెగ్యులర్ షెడ్యూల్ మొదలవుతుంది. ఈ క్రమంలో బెల్లంకొండ-బాలకృష్ణ కాంబినేషన్ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్ర్రారంభమయ్యే అవకాశాలున్నాయి.