ప్రేమించే 'వాడే కావాలి'
'బంపర్ ఆఫర్' హీరో సాయిరామ్ శంకర్, సుహాని నాయికా నాయకులుగా నటిస్తున్న 'వాడే కావాలి' చిత్రం ఈనెల 11న విడుదల కానుందని నిర్మాత తెలిపారు. యస్.విఆర్.మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో, వీరు క్రియేషన్, శీ సద్గురు సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 11వ తారీఖున విడుదల కానున్న సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ, ఫీల్ ఉన్న ప్రేమకథా చిత్రమిదన్నారు. పెద్ద పెద్ద బ్యానర్స్ లో దర్శకత్వశాఖలో అనుభవం ఉన్న రాజేంద్ర దర్శన్ ఈ చిత్రాన్ని ఎంతో బాగా తీర్చిదిద్దారన్నారు. యస్.వి.ఆర్ మీడియా సీఇవో శోభ మాట్లాడుతూ తమ సంస్థ దశావతారం, సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి చక్కటి చిత్రాలను తెలుగులో విడుదల చేసిందని, అన్ని అంశాలున్న మంచి చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. చిరంజీవి అభిలాష చిత్రంలోని అద్భుతమైన పాటను ఇందులో రీమిక్స్ చేయడం జరిగిందని చెప్పారు. సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ తన కెరీర్ లో తనకు నచ్చిన టాప్ టెన్ పాటలలో ఈ చిత్రంలోని 'నువ్వేలేని నేను నేనే కాను' అన్న పాట ఒకటని చెబుతూ, ఆ పాటను ఈ సందర్భంగా ఆలపించారు. రీరికార్డింగ్ సమయంలో ఈ చిత్రంలోని సన్నివేశాలు ఎంతోగానో ఆకట్టుకున్నాయని అన్నారు. సాయిరామ్ నటన, అతని ఎమోషన్స్ ఎంతో బాగున్నాయని చెప్పారు. హేమ, గీత రచయిత బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నరేష్, ఆలీ, వేణుమాధవ్, చంద్రవాస్, కోట శంకరరావు, రఘుబాబు, చిత్రం శ్రీను, అన్నపూర్ణమ్మ తదితర తారాగణం. ఫైట్స్ రామ్, లక్ష్మణ్, రచన టి ప్రకాష్, నిర్మాతలు వీరేష్ బాబు, రఘునాథ్ సోగి, దర్శకత్వం రాజేంద్ర దర్శన్.
Be first to comment on this News / Article!
|