జాదూగాళ్లతో ఛార్మి జోడీ
'అనుకోకుండా ఒకరోజు', 'మంత్ర' చిత్రాలతో ప్రేక్షకులను సమ్మోహితులను చేసిన ఛార్మింగ్ అందాల ఛార్మి ఇప్పుడు ఓ కన్నడ చిత్రంలో స్టార్ హీరో ఉపేంద్రకు జోడిగా నటిస్తోంది. ఆ చిత్రాన్ని 'జాదూగాళ్లు' పేరుతో అనువదించి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రుతిక మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి ప్రకాష్ దర్శకుడు. విజయ్ ఫిలిమ్స్ పతాకంపై కె.ప్రభాకర్ నిర్మించిన ఈ చిత్రాన్ని మరో నిర్మాత, పంపిణీదారుడు యువరాజ్ అత్యధిక ప్రింట్లతో ఆంధ్రదేశమంతటా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఉపేంద్రకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉందనీ, ఆయన నటించిన విభిన్న చిత్రాలకు మించిన వైవిధ్యంతో ఈ చిత్రం రూపొందిందనీ యువరాజ్ తెలిపారు. ఉపేంద్ర, ఛార్మి జనాలను మోసం చేసే జాదుగాళ్లుగా నటిస్తున్నారనీ, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా వీరి పాత్రలు ఉంటాయనీ చెప్పారు. ఈ వారంలోనే శరవణ ఆడియో ద్వారా పాటలు విడుదల చేసి, ఇదే నెలలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జెన్నిఫర్, సత్య ప్రకాష్, సాయాజీ షిండే, పాంగు, సుమిత్ర, గిరీష్ కర్నాడ్ తదితరులు నటించారు. థ్రిల్లర్ మంజు ఫైట్స్, గురుకిరణ్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|