'లీడర్' రాక 31న?
ఈ ఏడాది పూర్తి కావడానికి మరో మూడు వారాలు మాత్రమే ఉండటంతో ప్రేక్షకులలో క్యూరియాసిటీని నింపిన పలు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ సీజన్ లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో శేఖర్ కమ్ముల 'లీడర్' ఒకటి. 'హ్యాపీడేస్' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం కావడం, డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు తనయుడు రానాకు హీరోగా ఇది తొలి చిత్రం కావడంతో సహజంగానే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇంతవరకూ ప్రేమకథా చిత్రాలనే హ్యాండిల్ చేసిన శేఖర్ కమ్ముల అందుకు పూర్తి భిన్నంగా నేటి సమకాలీన రాజకీయ నేపథ్యంలో ప్రజలు కోరుకునే నాయకుడు ఎలా ఉండాలనే కథాంశంతో 'లీడర్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కు ముందుగానే ఈనెల 21న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ కు మరింత వ్యవధి అనివార్యమని దర్శకుడు భావించడంతో రిలీజ్ తేదీలో మార్పు చోటుచేసుకుందని సమాచారం. ఈ ఏడాదికి ముగింపు, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈనెల 31న ఈ చిత్రాన్ని రీలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.
'లీడర్' సాధించబోయే విజయంపై శేఖర్ కమ్ముల ధీమాతో ఉన్నారనీ, అయితే పోస్ట్ ప్రొడక్షన్ కు మరింత వ్యవధి అవసరమని భావించడంతో 31వ తేదీని ఎంచుకున్నారనీ చెబుతున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఆడియోకు ఇప్పటికే మంచి స్పందన లభిస్తోందనీ, సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులకు ఆడియో మరింత చేరువవుతుందనీ దర్శకనిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. రాణాకు జోడిగా రిచా, ప్రియా ఆనంద్ నటిస్తున్నారు. తోట తరణి కళా దర్శకత్వం, విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్స్ గా నిలువనున్నాయి. ప్రతిష్ఠాత్మక ఏవియం బ్యానర్ నుంచి వస్తున్న 174వ చిత్రమిది. ఎం.ఎస్.గుహన్, అరుణ గుహన్, అపర్ణా గుహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Be first to comment on this News / Article!
|