రవితేజ కథానాయకుడుగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న చిత్రానికి సంబంధించి మొదట్నించీ పలు మార్పులు-చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. తొలుత గోపీచంద్ హీరోగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేసినప్పటికీ చివరి నిమిషంలో రవితేజ ఎంపిక జరిగింది. ఇప్పుడు హీరోయిన్ మార్పు కూడా జరిగినట్టు సమాచారం. ఈ చిత్రంలో కథానాయికగా అనుష్క ను ఎంపిక చేసినట్టు తొలుత నిర్మాతలు ప్రకటించారు. తాజాగా అనుష్క స్థానే త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తెలిసింది. అనుష్క చేతిలో డేట్లు లేకపోవడంతో ఈ మార్పు అనివార్యమైందని సమాచారం.
త్రిష ప్రస్తుతం తెలుగులో 'నమో వెంకటేశ' చిత్రంలో వెంకటేష్ కు జోడిగా నటిస్తోంది. మరోవైపు 'కట్టామీటా' చిత్రంతో హిందీలోకి అడుగుపెడుతోంది. తాజాగా ఆమె మరోసారి రవితేజ కాంబినేషన్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'కృష్ణ' మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు రెండోసారి ఈ జంట కలిసి నటించనున్న చిత్రం ద్వారా గోపి అనే యువకుడు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది.