కాజల్ చెల్లెలి 'వీళ్లే' ప్రారంభం
వినయ్ ('వాన' ఫేమ్), నిషా అగర్వాల్ (తొలి పరిచయం) జంటగా జెన్ టెక్స్ మూవీస్ పతాకంపై రవిప్రకాష్ ('మంత్ర' ఫేమ్) స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'వీళ్లే'. అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారంనాడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ ఇవ్వగా, ఎం.ఎం.కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు.
రచయిత సురేంద్రకృష్ణ మాట్లాడుతూ, ఇదే బ్యానర్ లో మూడేళ్ల క్రితం 'మంత్ర' సినిమా తీశామనీ, ప్రేక్షకులు చక్కటి ఆదరణ చూపారనీ చెప్పారు. 'మంత్ర' చిత్రానికి రచయిత, నిర్మాత అయి రవిప్రకాష్ ఈ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారని చెప్పారు. ఈ చిత్రంలో కాజల్ సోదరి నిషా అగర్వాల్ హీరోయిన్ గా పరిచయమవుతోందని చెప్పారు. ప్రేమ, యువతరం తీరుతెన్నులను ఈ చిత్రంలో చూపిస్తున్నామనీ, శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని రవిప్రకాష్ తెలిపారు. మేలో సినిమా రీలీజ్ ఉంటుందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో హేమ, సూర్య, అవినాష్, శ్రావణి, సింధు, హరీష్ తదితరులు నటించనున్నారు. రవిప్రకాష్ కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం అందిస్తున్న ఈ చిత్రానికి శివేంద్ర సినిమాటోగ్రఫీ, ఆనంద్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|