మరో థ్రిల్లర్ 'ఆఖరి అన్వేషణ'
ప్రపంచ సుందరి జాంకీ షా హీరోయిన్ గా వినోద్ చాప్రా దర్శకత్వంలో హిందీలో రూపొందిన 'మిస్టరీ షక్' చిత్రాన్ని విఘ్నేష్ పిక్చర్స్ పతాకంపై 'ఆఖరి అన్వేషణ' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత టి.దుర్గారావు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.
కొన్ని కోట్ల ఆస్తికి వారసురాలైన హీరోయిన్ ను కొందరు చంపాలని కుట్ర పన్నుతారు. ఆ క్రమంలో చాలామంది ప్రాణాలు కోల్పోతారు. తనను చంపడానికి ప్రయత్నిస్తున్న దుష్టశక్తుల నుంచి హీరోయిన్ ఎలా తప్పించుకుని బయటపడిందనేది ఈ చిత్ర కథాంశమని దుర్గారావు తెలిపారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ఎంతో ఉత్కంఠ కలిగిస్తుందనీ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకం తనకుందనీ అన్నారు. రొమాంటిక్ మర్డర్ మిస్టరీ గా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఇందులో ఉంటాయన్నారు. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ధనుంజయ్ చౌహాన్, ఆర్తి పురి, ప్రేమ్ చోప్రా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి పొందూరి మాటలు, పాటలు అందించారు.
Be first to comment on this News / Article!
|