జెపి ఆవిష్కరించిన 'ప్రస్థానం'
శర్వానంద్, రూబీ జంటగా వి.ఆర్.సి. మీడియా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వల్లభనేని రవి నిర్మాణ సారథ్యంలో దేవ్ కట్టా దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ప్రస్థానం' . ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లో జరిగింది. ఆడియో సీడీని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించారు. వల్లభనేని రవి, దేవ్ కట్టా, శర్వానంద్, సందీప్ కిషన్, చిత్ర సంగీత దర్శకుడు మహేష్ శంకర్, హీరోయిన్ రూబీ, నటులు సుమన్, నిహాల్ తదితరులు పాల్గొన్నారు.
జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉద్యమాలన్నీ యువతరంపైనే ఆధారపడి నడుస్తున్నాయనీ, ఇది యువతకు చక్కని సందేశాన్నిస్తూ రూపొందిన చిత్రమనీ అన్నారు. ఈ చిత్రం కథ చాలా బాగుందనీ, చిత్ర యూనిట్ అందరూ కుర్రాళ్లేననీ అన్నారు. ఇలాంటి సందేశాత్మక చిత్రాలు కమర్షియల్ గా కూడా విజయవంతం కావాలని అభిలషించారు. 'వెన్నెల' చిత్రం తర్వాత రెండేళ్లు ఈ కథ కోసం కష్టపడినట్టు దేవ్ కట్టా తెలిపారు. శర్వానంద్ ఈ కథకు సరిగ్గా సరిపోతాడని భావించి ఆయనను ఎంపిక చేశామన్నారు. ఇందులో లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని చెప్పారు. ఇందులో 7 పాటలు ఉంటాయనీ, మహేష్ శంకర్ చాలా చక్కటి సంగీతం అందించారనీ చెప్పారు. తన కెరీర్ లోనే ఈ చిత్రం ఒక మైలురాయి అవుతుందని, తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందనీ హీరో శర్వానంద్ అన్నారు. సినిమా మ్యూజిక్, శర్వానంద్ నటన మెచ్చుకోలుగా ఉన్నాయనీ, సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని అనుకుంటున్నాననీ వల్లభనేని రవి పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|