శాంతారాం అవార్డుకు తమన్నా
'హ్యాపీడేస్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించి తమిళంలో ప్రస్తుతం మంచి డిమాండ్ లో ఉన్న తమన్నా ఇప్పుడు ప్రతిష్ఠాత్మక శాంతారామ్ పురసర్కానికి నామినేట్ అయింది. సిద్ధార్ధ, తమన్నా జంటగా కిషోర్ కుమార్ (డాలీ) ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించిన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి అభిరుచిగల చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో నటనకు గాను శాంతారాం పురస్కారాలకు ఉత్తమ కథానాయిక విభాగంలో తమన్నా నామినేట్ అయింది. ఇదే చిత్రానికి ఉత్తమ నూతన దర్శకుడి విభాగంలో కిషోర్ కుమార్ నామినేట్ అయ్యారు. ఈనెల 21న ముంబైలో తుది పురస్కారాలను ప్రకటించనున్నారు.
ప్రతిష్ఠాత్మక శాంతారామ్ పురస్కారాలకు తమన్నా, తానూ నామినేట్ కావడం హ్యాపీగా ఉందని దర్శకుడు కిషోర్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో సున్నితమైన భావోద్వేగాలను తెరకెక్కించడం అందరికీ నచ్చిందని అన్నారు. ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయనున్నామనీ, రాజశ్రీ ప్రొడక్షన్స్ తో కలిసి సురేష్ బాబు, నల్లమలుపు బుజ్జి నిర్మించనున్నారనీ ఆయన చెప్పారు. వచ్చే ఏడాది చిత్రీకరణ మొదలవుతుందని చెప్పారు. దక్షిణాది నుంచి తమ చిత్రానికి ఈ గౌరవం దక్కడం సంతోషంగా ఉందని నల్లమలుపు బుజ్జి పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|