ఫైట్ మాస్టర్ రాజు మృతి
తెలుగు సినీ ఫైట్ మాస్టర్ రాజు సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. గుండెపోటు రాగానే ఆయనను చీరాలలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామమైన ప్రకాశం జిల్లా వేటపాలెం తరలించారు. అక్కడే కుటుంబ సభ్యుల మధ్య అంత్రక్రియలు నిర్వహించనున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
నటరత్న ఎన్టీఆర్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ వంటి ప్రముఖ హీరోలందరికీ రాజు ఫైట్స్ కంపోజ్ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. వందలాది చిత్రాలకు ఆయన ఫైట్స్ కంపోజ్ చేయడంతో పాటు గణనీయంగా పలు చిత్రాల్లో ఫైటర్ గా నటించారు కూడా. ఒక దశలో అన్ని సినిమాలకు ఆయన ఫైట్స్ సమకూర్చి పూర్తి స్థాయి బిజీలో ఉన్నారు. చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పిన 'ఖైదీ' చిత్రానికి ఆయన ఫైట్స్ కంపోజ్ చేశారు. ఎప్పటి కప్పుడు ఫైట్స్ లో కొత్తదనం కోసం ప్రయోగాలు చేయడంలో రాజు దిట్ట. పలువురు అగ్రహీరోలతో స్క్రీన్ పై బాహాబాహీ ఫైట్స్ చేసేవారు. దాదాపు ఆయనను తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండరనే చెప్పొచ్చు. పలువురు ఫైటర్లు ఆయన వద్ద శిక్షణ పొంది ఫైట్ మాస్టర్లు అయ్యారు. తెలుగు సినిమాల్లో ఇతర భాషలకు చెందిన ఫైట్ మాస్టర్లు అడుగుపెట్టడంతో కొద్దికాలంగా ఆయన తన వృత్తికి దూరంగానే ఉంటున్నారు. అవకాశాలు వచ్చినప్పుడు మాత్రమే చేస్తున్నారు. ఎందరు ఫైట్స్ మాస్టర్లు వచ్చినా తెలుగు సినీ ఫైట్ మాస్టర్ గా రాజు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతితో ఒక నిబద్ధత కలిగిన తెలుగు ఫైట్ మాస్టర్ ను పరిశ్రమ కోల్పోయిందనీ, ఆయన లేని లోటు తీరేది కాదనీ పలువురు ఫైటర్లు, ఆయనతో అనుబంధం ఉన్న సినీ ప్రముఖులు వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Be first to comment on this News / Article!
|