'స్వామి మణికంఠ' ఆడియో
అయ్యప్ప స్వామిగా కౌశిక్ బాబు నటించిన చిత్రం 'స్వామి మణికంఠ'. విజిష్ మణి దర్శకత్వంలో అనస్వర ఆర్ట్స్ పతాకంపై టి.ఆర్.కె.నాయర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లో జరిగింది. ప్రముఖ నిర్మాత, కవి ఎం.ఎస్.రెడ్డి ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి సీడీని దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ కు అందించారు. మలయాళ వెర్షన్ కు చెందిన ఆడియో సీడీని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించి తొలి ప్రతిని కౌశిక్ బాబుకు అందజేశారు.
ఎం.ఎస్.రెడ్డి మాట్లాడుతూ, కౌశిక్ బాబును అయ్యప్ప పాత్రలో చూస్తుంటే నిజమైన అయ్యప్పను చూస్తున్నట్టే ఉందనీ, అతనిలో ఎంతో ప్రతిభ ఉందనీ అన్నారు. దానిని చిత్ర పరిశ్రమ ఉపయోగించుకో గలిగితే పరిశ్రమకు ఎంతో లాభం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన 'ఆంధ్రప్రభ' సంపాదకులు పి.విజయబాబు మాట్లాడుతూ, భగవంతుడు ఉన్నాడా అంటూ హేతువాదులు అడిగే ప్రశ్నలకు జవాబులు, అయ్యప్ప స్వామి వైశిష్ట్యంపై నెలకొన్న సందేహాలకు సమాధానంగా ఈ చిత్రకథ ఉంటుందన్నారు. సోషియో చైల్డ్ సెంటిమెంట్ తో కూడుకున్న భక్తిరస చిత్రమిదని పేర్కొన్నారు. గతంలో వచ్చిన 'దేవుళ్లు' చిత్రం తరహాలో అపూరూపమైన దేవాలయాల వైభవాన్ని ఈ చిత్రంలో చూడవచ్చని అన్నారు. పంబ నుంచి శబరిమల దేవాలయం వరకూ షూటింగ్ లకు అనుమతి లేకపోయినప్పటికీ, ప్రత్యేకించి ఈ చిత్రం షూటింగ్ కు అనుమతినివ్వడం ఓ విశేషమని అన్నారు. కౌశిక్ తో పాటు ఆర్టిస్టులంతా తమ పాత్రలకు చక్కటి న్యాయం చేకూర్చారని చెప్పారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, అప్పయ్య స్వాములు మాలధారణ చేపట్టే మంచి సీజన్ లో ఈ చిత్రం రానుండటం యూనిట్ కు ఎంతో ఉపకరిస్తుందన్నారు. కౌశిక్ కు మలయాళంలో కూడా హారతులు పడుతుండటం తెలుగువారంతా గర్వించే విషయమని ఎన్.శంకర్ పేర్కొన్నారు. ఇందులో తాను ఓ పాట పాడటంతో పాటు ఒక పాత్ర కూడా పోషించినట్టు ప్రముఖ గాయకుడు వి.రామకృష్ణ చెప్పారు. నటుడు సాయికిరణ్ మాట్లాడుతూ, ఇందులో తాను ఓ ముఖ్యపాత్ర పోషించాననీ, కౌశిక్ తో పాటు మాస్టర్ అతులిత్ ఎంతో బాగా నటించారని చెప్పారు. ఇంతవరకూ వచ్చిన అయ్యప్ప చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని కౌశిక్ చెప్పారు. పాటలు కూడా ఎంతగానో అలరిస్తాయని అన్నారు. దర్శకుడు విజిష్ మణి మాట్లాడుతూ, తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలలో ఈ చిత్రాన్ని తీశామని చెప్పారు. ఇందులో 10 శ్రావ్యమైన పాటలున్నాయని సంగీత దర్శకుడు మనురమేష్ చెప్పగా, భక్తి చిత్రాలలో కొత్త అనుభూతిని కలిగించే చిత్రమిదని నిర్మాత నాయర్ పేర్కొన్నారు. ఫిలిం చాంబర్ కార్యదర్శి ప్రసన్నకుమార్, దైవజ్ఞ శర్మ, జంగ్లీ మ్యూజిక్ ప్రతినిధి సత్యదేవ్, మాస్టర్ అతులిత్, నటుడు కెకె శర్మ తదితరులు పాల్గొన్నారు. శృతికీర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
Be first to comment on this News / Article!
|