'కేడీ' ఆడియో 25న
నాగార్జునకు ఉన్న డిసెంబర్ రిలీజ్ ల సెంటిమెంట్ ఈసారి కార్యరూపంలోకి రాకపోయినా ఆయన తాజా చిత్రం ఆడియో మాత్రం ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగార్జున కథానాయకుడుగా అన్నపూర్ణా స్టూడియోస్ సమర్పణలో కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న 'కేడీ' చిత్రం ఆడియో ఈ నెల 25న విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హైద్రాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
చిత్ర విశేషాలను నాగార్జున తెలియజేస్తూ, టైటిల్ కు తగినట్టుగా ఈ చిత్రంలో తన పాత్ర మనుషుల్ని మాయ చేసేలా ఉటుందనీ, రకరకాల షేడ్స్ తో ప్రేక్షకులకు వినోదం పంచుతుందనీ తెలిపారు. గాంబ్లింగ్, కార్ల దొంగతనాల నేపథ్యంలో కథ ఉంటుందనీ అన్నారు. ఎంటర్ టైన్ మెంట్ తో కథ ప్రారంభమై సీరియస్ తరహాలోకి మళ్లుతుందన్నారు. కిరణ్ మంచి ప్రతిభావంతుడైన దర్శకుడనీ, అలాగే సందీప్ చౌతా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనీ చెప్పారు. నిర్మాత శివప్రసాద్ రెడ్డికి ఇది రజతోత్సవ సంవత్సరం కూడా కావడంతో ఎక్కడా రాజీపడకుండా చక్కటి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలిపారు. సినిమా చాలా బాగా వస్తోందనీ, 2010లో తమ సంస్థ రజతోత్సవంలోకి అడుగుపెడుతున్న తరుణంలో నాగార్జునతో సినిమా చేయడం సంతోషంగా ఉందని శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 25న ఆడియో, జనవరి రెండో వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. నాగార్జునకు జోడిగా మమతా మోహన్ దాస్, మరో కీలక పాత్రలో అమెరికా అమ్మాయి లిండా, ప్రధాన పాత్రల్లో అంకుర్ ('స్లమ్ డాగ్ మిలయనీర్' ఫేమ్), నిర్మల్ పాండే ('బండిట్ క్వీన్'), అఖిలేంద్ర మిశ్రా ('లగాన్'), 'డాన్' విలన్ కెల్లీడార్జ్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, హర్షవర్దన్, తనికెళ్ల భరణి నటిస్తున్నారు. కిరణ్ కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం అందిస్తున్న ఈ చిత్రానికి చంద్రబోస్-కృష్ణ చైతన్య పాటలు, సెల్వ ఫైట్స్, సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ, శ్రమణ్ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|