'మా' డైరీ ఆవిష్కరణ
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) 2010 డైరీ విడుదలైంది. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో మంగళవారంనాడు జరిగిన కార్యక్రమంలో సీనియర్ నటుడు, 'మా' ముఖ్య సలహాదారు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఈ డైరీని ఆవిష్కరించి తొలి ప్రతిని మరో ప్రముఖ నటుడు కృష్ణకు అందజేశారు.
అక్కినేని ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ డైరీని చక్కటి సమాచారంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం అభినందనీయమని అన్నారు. అయితే లక్షలాది రూపాయలు పారితోషికం తీసుకునే ఆర్టిస్టులు ఉండగా ఈ డైరీకి అయ్యే ఖర్చు కోసం బయట స్పాన్సరర్లపై ఆధారపడటం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రతి ఆర్టిస్టు తమ వార్షిక ఆదాయం నుంచి కనీసం ఒక శాతం 'మా'కు ఇస్తే బాగుంటుందని గతంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ అది అమలులోకి రాలేదని అన్నారు. ఇందుకు 'మా' అధ్యక్షుడు మురళీ మోహన్ స్పందిస్తూ, ప్రస్తుతం నిధుల లేమిని 'మా' ఎదుర్కొంటోందన్నారు. వృద్ధ కళాకారులకు ఇచ్చే నెలసరి భత్యాలు చెల్లించడం కూడా కష్టమౌతోందని చెప్పారు. దీంతో డైరీని తెచ్చేందుకు స్పానరర్లపై ఆధారపడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఆర్టిస్టులు, దర్శకనిర్మాతలు, ట్రేడ్ యూనియన్ల ఫోన్ నెంబర్లతో పాటు ఆర్టిస్టుల పుట్టినరోజు సమాచారం కూడా ఈ డైరీలో పొందుపరచామని అన్నారు. చక్కటి సమాచారంతో ఈ డైరీని తీర్చిదిద్దారని కృష్ణ, శ్రీమతి విజయనిర్మల పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఏవియస్ మాట్లాడుతూ, 'మా' నిధుల సేకరణ కోసం ఫిబ్రవరి 14న స్టార్ క్రికెట్ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటులు బాలయ్య, రమాప్రభ, గీతాంజలితో పాటు బెంగుళూరు పద్మ, ఆలీ, బ్రహ్మాజీ, అశోక్ కుమార్, మహర్షి రాఘువ, రాజా రవీంద్ర, వినోద్ బాల, మాణిక్ తదితరులు పాల్గొన్నారు. తొలుత సోమవారం తెల్లవారు జామున జరిగిన ఫైట్ మాస్టర్ రాజు మృతికి అంతా శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
Be first to comment on this News / Article!
|