ఇక ఫంక్షన్లకు రానుః అక్కినేని
ప్రముఖ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఇక నుంచి ఫంక్షన్లకు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు ప్రకటించారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పటికీ 86వ పడిలోకి అడుగుపెట్టినందున రిస్క్ తీసుకోవడం ఎందుకనే ఉద్దేశంతో ఇక నుంచి ఫంక్షన్లకు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు చెప్పారు. హైద్రాబాద్ లో మంగళవారంనాడు జరిగిన 'మా' డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో అక్కినేని ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 'మా' డైరీని స్వయంగా అక్కినేని ఆవిష్కరించి...వచ్చే ఏడాది డైరీ ఆవిష్కరణకు తాను రాలేనని అన్నారు.
చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉండాలని తాను గతంలో నిర్ణయించుకున్నాననీ, 'శ్రీరామదాసు' తర్వాత మళ్లీ తాను నటించలేదనీ ఆయన అన్నారు. సినిమాలో నటిస్తే డబ్బు బాగా ఇచ్చే వారు ఉన్నప్పటికీ ఏదో ఒక పాత్ర చేయాలని తాను అనుకోవడం లేదనీ, ఆచితూసి సినిమాలు చేస్తాననీ అన్నారు. డబ్బు కోసం ఏదో ఒక పాత్ర చేయడం వల్ల నాగేశ్వరరావు ఇలాంటి పాత్రలు చేస్తున్నారంటూ పాతతరం వారు తిట్టుకునే ప్రమాదం ఉందన్నారు. అలాగే అలాంటి పాత్రల వల్ల నవతరాన్ని కూడా సంతృప్తి పరచలేమని అభిప్రాయపడ్డారు. 'సీతారామయ్యగారి మనవరాలు' చిత్రంలోని సీతారామయ్య లాంటి పాత్రలైతేనే చేయదలచుకున్నానని స్పష్టం చేశారు. ఫంక్షన్లకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నట్టు నాగేశ్వరరావు పేర్కొనడనంపై హాస్యనటుడు ఆలీ స్పందిస్తూ, పరిశ్రమలో పెద్దదిక్కు అక్కినేని నాగేశ్వరరావు అనీ, ఆయనను తాము దైవంగా భావిస్తామనీ అన్నారు. ఆయన పెద్ద మనుసులో తన నిర్ణయాన్ని పున: పరిశీలించి సినిమా రంగానికి చెందిన ఫంక్షన్లకు హాజరుకావాలని తామంతా కోరుకుంటున్నామని చెప్పడంతో అక్కినేని చిరునవ్వులు చిందించారు.
Read 4 Comment(s) posted so far on this News / Article!
|