గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఇటీవల 'గజనీ' (హిందీ), 'మగధీర' వంటి సెస్సేషన్ హిట్ చిత్రాలను నిర్మించిన అల్లు అరవింద్ తాజాగా తన ఫ్యామిలీ హీరోల సినిమాలే కాకుండా మరిన్ని బయట చిత్రాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే మహేష్ బాబు కథానాయకుడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సింగనమల రమేష్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్తచిత్రం ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నారు. 'అతిథి' తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తో మహేష్ బాబు ఈ చిత్రంలో నటిస్తున్నందున ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే భారీ ఆఫర్ తో ఈ చిత్రం పంపిణీ హక్కులను అల్లు అరవింద్ కైవసం చేసుకున్నారు.
'అతడు' వంటి సంచలన విజయం తర్వాత మహేష్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త చిత్రానికి 'కిలాడి' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ సంఖ్యాశాస్త్రం ప్రకారం సింగిల్ లెటర్ తో టైటిల్ అనుకుంటారనే ప్రచారం కూడా ఉంది. మూడు అక్షరాల 'అతడు' తర్వాత ఒక అక్షరం తగ్గించి తీసిన 'జల్సా' మంచి హిట్ కావడంతో ఇప్పుడు మరో అక్షరం తగ్గించి సింగిల్ లెటర్ టైటిల్ అనుకుంటున్నారట. అయితే అధికారికంగా ఈ విషయం ఖరారు కావలసి ఉంది. ఈ చిత్రంలో మహేష్ కు జోడిగా అనుష్క తొలిసారి నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అన్నట్టు...ఈ చిత్ర నిర్మాత సింగనమల రమేష్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ కథానాయకుడుగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో నిర్మిస్తున్న 'పులి' చిత్రాన్ని కూడా గీతా ఆర్ట్స్ సంస్థ భారీ ఆఫర్ తో సొంతం చేసుకోనుందని తెలుస్తోంది.