'ఆర్య-2' ప్రదర్శనల నిలిపివేత!
ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఆందోళనల ప్రభావం ఇంతవరకూ తెలుగు సినిమాల కొత్త రిలీజ్ లు, కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం చూపుతూ కోట్లలో నష్టం ఎదురవుతుండగా...ఇప్పుడు ఆ ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చింది. తెలంగాణను వ్యతిరేకించే వారి సినిమాలు నైజాంలో ఆడనీయమని పలువురు తెలంగాణా వాదులు అల్లు అర్జున్ కథానాయకుడుగా నటించిన 'ఆర్య-2' చిత్రం ప్రదర్శననను తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారంనాడు అడ్డుకున్నారు. రాజకీయాల ప్రభావం ఇంతగా తెలుగు సినిమాలపై పడటం ఇదే ప్రథమం.
'సామాజిక తెలంగాణ' వైఖరిని ఇంతవరకూ చాటుకున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఇప్పుడు సమైక్య ఆంధ్రకు మద్దతుగా నిలిచేందుకు నిర్ణయించినట్టు ఉదయం నుంచే ఫీలర్లు బయటకు రావడంతో తెలంగాణ జిల్లాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. చిరంజీవి తీసుకున్నట్టు చెబుతున్న నిర్ణయం 'ఆర్య-2' చిత్రంపై పడింది. నైజాంలోని పలు ఏరియాల్లో థియేటర్ ఓనర్లు స్వచ్ఛందంగా ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన కొందరు నాయకులు జహీరాబాద్ లో సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో ఓ థియేటర్ లో నడుస్తున్న 'ఆర్య-2' సినిమా రీళ్లను టీఆర్ఎస్, పిఆర్ఎస్ కార్యకర్తలు దగ్దం చేసినట్టు తెలిసింది. అందరివాడనుకున్న చిరంజీవి కొందరివాడు కావడం, మాట మార్చడంపై కార్తకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. చిరంజీవి కుటుంబ సభ్యులైన పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలను తాము బాయ్ కాట్ చేస్తామని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, హైద్రాబాద్ ఉస్మానియా యూనివర్శిటీ, వరంగల్ కాకతీయ యూనివర్శిటీ విద్యార్థులు ప్రకటించారు.
Be first to comment on this News / Article!
|