'ఆదుర్స్' చిత్రంపైనా బ్యాన్?
ఎన్టీఆర్ కథానాయకుడుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'అదుర్స్' చిత్రం విడుదలకు ముందే చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ చిత్రాన్ని ఈనెల 25వ తేదీని దాదాపు 1000 ప్రింట్లతో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని సన్నాహాలు చేస్తున్నారు. అయితే బుధవారంనాడు తెలంగాణా జిల్లాల్లోని పలు చోట్ల 'ఆర్య-2', 'మగధీర' ప్రదర్శనలను ఆందోళనకారులు అడ్డుకుని నిలిపి వేయడంతో ఈనెలలో పెద్ద రిలీజ్ గా వస్తున్న 'అదుర్స్' చిత్రం విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురుకావచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.
'సామాజిక తెలంగాణ' వైఖరని ఇంతవరకూ చాటుకున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సమైక్య ఆంధ్ర కు మద్దతుగా నిలిచేందుకు నిర్ణయించారనీ, గురువారంనాడు ఆయన తిరుపతిలో సమైక్య ఆంధ్య ఉద్యమకారులకు మద్దతు తెలుపనున్నారనీ వార్తలు రావడంతో తెలంగాణాలోని వరంగల్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో 'ఆర్య 2' చిత్రం ప్రదర్శనలకు తెలంగాణా అనుకూల వాదులు నిలిపివేశారు. పోస్టర్లు చించేశారు. నైజాం ఏరియాలో చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమాలను అడ్డుకోవడమే కాకుండా, ఎవర్నీ చూడకుండా నిలువరిస్తామని తెలంగాణ విద్యార్థుల సంయుక్త కార్యాచరణ కమిటీ ప్రకటించింది. స్టార్ హీరోలు కూడా తమ వైఖరిని ప్రస్ఫుటం చేయాలని డిమాండ్ చేసింది. ఇదే సమయంలో ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ న్యూఢిల్లీలో తెలంగాణా వ్యతిరేక వైఖరి ప్రదర్శించారంటూ జెఎసి నాయకులు గుర్రుగా ఉన్నారు. నైజాంలో 'అదుర్స్ ' చిత్రాన్ని కూడా బ్యాన్ చేయాలనుకుంటున్నట్టు వారు ప్రకటించారు. ఈ పరిస్థితి కొత్త చిత్రాల రిలీజ్ కు సిద్ధంగా ఉన్న పలువురు నిర్మాతలను అయోమయంలోకి నెట్టింది.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|