కొత్తతరం 'సుభద్ర'
'భద్రాచలం', 'చందమామ' వంటి హిట్ చిత్రాల అనంతరం సింధుమీనన్ టైటిల్ పాత్ర పోషిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం 'సుభద్ర'. ఈ చిత్రం ఇటీవల డాక్టర్ డి.రామానాయుడు చేతుల మీదుగా విడుదలైంది. శ్రీకాంత్ టాకీస్ పతాకంపై బేబి హరిణి సమర్పణలో శ్రీకాంత్ గౌడ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజా వన్నెంరెడ్డి దర్శకుడు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని రీరికార్డింగ్ లోకి అడుగుపెట్టింది.
చిత్ర విశేషాలను శ్రీకాంత్ గౌడ్ తెలియజేస్తూ, రాజా వన్నెంరెడ్డి ఇంతవరకూ చేసిన చిత్రాలకు భిన్నంగా వైవిధ్యమైన కథా చిత్రంగా దీనిని తెరకెక్కించారనీ, సింధుమీనన్ తన పాత్రకు చక్కటి న్యాయం చేశారనీ తెలిపారు. ఇటీవలే విడుదలైన ఆడియోకి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. అందరూ మెచ్చే స్థాయిలో చక్రి ఈ చిత్రానికి రీ-రికార్డింగ్ చేస్తున్నారని అన్నారు. నిర్మాతగా ఇది తన తొలి చిత్రమనీ, చిత్రం రషెస్ చూసిన చక్రి చాలా బాగుంటుందంటూ అభినందించారనీ తెలిపారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు తప్పని సరిగా ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం తనకుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రీరికార్డింగ్ పూర్తి కాగానే మిక్సింగ్ కార్యక్రమాలు జరిపి త్వరలోనే సినిమా విడుదల చేస్తామని చెప్పారు. ఈ చిత్రంలో రవికిరణ్ ముఖ్యపాత్ర పోషించగా, ఆశిష్ విద్యార్థి, సుమన్, భానుచందర్, చలపతిరావు, చిన్నా, గౌతంరాజు, అన్నపూర్ణ, సురేఖ వాణి, హేమ ఇతర పాత్రలు పోషించారు. రాజా వన్నెంరెడ్డి కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం అందించిన ఈ చిత్రానికి సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, చక్రి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|