'లీడర్'కు క్లీన్ యు
శతాధిక చిత్రాల నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు మనువడు రాణా కథానాయకుడుగా పరిచయమవుతున్న 'లీడర్' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఎలాంటి విజువల్ కట్స్ లేకుండా, ఒకటి రెండు డైలాగ్ లు ఆల్టర్ చేయాలని సూచిస్తూ సెన్సార్ వారు 'క్లీన్ యు' సర్టిఫికెట్ ఇచ్చారు. ప్రతిష్ఠాత్మక ఎవిఎం 174వ చిత్రంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎం.ఎస్.గుహన్, అరుణ గుహన్, అపర్ణా గుహన్ ఈ చిత్రాన్ని దాదాపు 15 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు.
నేటి సమకాలీన రాజకీయ నేపథ్యంలో ప్రజలు కోరుకునే నాయకుడు ఎలా ఉండాలనే కథాంశంతో 'లీడర్' చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. ప్రతిభ ఆధారంగానే రాణా ఎంపిక జరిగిందనీ, ఆజానుబాహుడైన రానా తన కథకు సరిపోయే హీరో అని నమ్మడంతోనే ఎంపిక చేశాననీ, అందుకు తగ్గట్టే తన పాత్రకు రానా సంపూర్ణ న్యాయం చేశాడనీ ఆయన ఇటీవల తెలిపారు. 'హ్యాపీడేస్' తర్వాత ఆరు నెలల పాటు కేవలం టీవీ చూస్తూ గడిపాననీ, ఆ సమయంలోనే పొలిటికల్ ఫిల్మ్ తీయాలనే థాట్ రావడంతో 'లీడర్' చిత్రాన్ని తెరకెక్కించామనీ చెప్పారు. తన కెరీర్ లో ఈ చిత్రం ఒక మైలురాయిగా మిగిలిపోతుందని అన్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందించిన ఆడియోకి ఇప్పటికే మంచి స్పందన లభిస్తుండగా, సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులకు మరింత చేరువవుతుందనే నమ్మకాన్ని నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. రాణాకు జోడిగా రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ నటించిన ఈ చిత్రంలో ఉదయభాను ఓ ఐటెం సాంగ్ లో నర్తించింది. ఈ చిత్రానికి తోణ తరణి కళా దర్శకత్వం, విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రస్తుతం తెలంగాణ, సమైక్ష ఆందోళనల నేపథ్యంలో ఈ చిత్రాన్నిఈనెల 31న కానీ, జనవరి మొదటివారంలో కానీ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|