'సలీమ్'కు కోట్లలో నష్టం!
రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితులు తెలుగు చిత్ర సీమను సంక్షోభంలో నెట్టేస్తున్నాయి. 'ఆర్య-2', 'మగధీర', 'సలీమ్'
చిత్రాల ప్రదర్శనలను తెలంగాణా ప్రాంతాల్లో పలుచోట్ల ప్రదర్శకులు అడ్డుకోవడం, విధ్వంసాలకు పాల్పడుతుండటంతో ఆయా చిత్రాల నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలు చవిచూస్తున్నారు. 'మగధీర' చిత్రం సెంచరీ కొట్టి చాలా రోజులే కావడంతో తాజా పరిణామాల వల్ల పెద్దగా నష్టం లేదనీ, మహా అయితే సిల్వర్ జూబ్లీ (175 డేస్) రికార్డులకే దెబ్బపడుతుందని విశ్లేషకుల అంచనా. ఆ ప్రకారం 'ఆర్య-2' సైతం ఇటీవలే విడుదలైనా ఇనీషియల్ ఓపినింగ్స్ రాబట్టుకోగలిగింది. ఈ రెండింటితో పోలిస్తే 'సలీమ్' చిత్రంపై కోలుకేలేని దెబ్బ పడి నిర్మాత మోహన్ బాబుకు కోట్లలో నష్టం ఖాయమైందని వారు తేల్చిచెబుతున్నారు.
తొలుత ఈనెల 11న విడుదల కావాల్సిన 'సలీమ్' చిత్రాన్ని ఒకరోజు ఆలస్యంగా 12న మోహన్ బాబు రిలీజ్ చేశారు. ఆసరికి తెలంగాణలో 'విజయోత్సవాలు', ఆంధ్ర-రాయలసీమ జిల్లాలో ఉద్యమాలు మొదలుకావడంతో 'సలీమ్' సెపరేట్ మంటల్లో చిక్కుకుపోయింది. సీమలోని కొన్ని ప్రాంతాలలో సినిమా విడుదలకు నోచుకోలేదు. రాష్ట్రంలోని మిగతా ఏరియాల్లో 'సలీమ్' సరైన ఓపినింగ్స్ ను కూడా రాబట్టుకోలేకపోయింది. మరోవైపు బలహీన టాక్ బయటకు రావడంతో 'దేవదాసు' తరహాలోనే మూడు నాలుగు వారాల తర్వాత 'సలీమ్' కూడా పుంజుకుంటుందని దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి అభిప్రాయపడ్డారు. అందుకు కూడా ఇప్పుడు ఇంకో గండిపడింది. మోహన్ బాబు సమైక్యాంధ్యకు మద్దతు పలకడంతో ఆ చిత్రానికి కలెక్షన్ల పరంగా దుర్భర పరిస్థితి ఏర్పడింది. తెలంగాణా విద్యార్థుల జెఎసి నుంచి ప్రతిఘటన ఎదురు కావడం, తెలంగాణలో సినిమా నిలిపి వేస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీ నష్టాన్ని చవిచూస్తున్నారు. 23 కోట్లు పెట్టుబడి పెట్టామని చెబుతున్న మోహన్ బాబు, చిత్ర నిర్మాణంలో భారీ పెట్టుబడి పెట్టిన రిలయెన్స్ బిగ్ పిక్చర్స్ సైతం కోట్లలో మునిగిపోవడం ఖాయమైందంటున్నారు. ఏదో మాయాజాలం జరిగితే తప్ప 'సలీమ్' తేలడం దాదాపు అనుమానమే...
Read 2 Comment(s) posted so far on this News / Article!
|