'అదుర్స్' బెదిరిందా?
తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు, బంద్ ల ప్రభావం తెలుగు పరిశ్రమకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వీటి ప్రభావంతో ధియేటర్లు బంద్ పాటించడం, షూటింగ్ లకు అంతరాయం కలుగుతోంది. కొన్ని చోట్ల కొత్త సినిమాల రిలీజ్ లను నిలిపివేయడం, విడుదలైన సినిమాలను చూసే మూడ్ ప్రేక్షకులలో లేకపోవడం వంటి పరిణామాలతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కోట్లాది రూపాయల నష్టాలను చవిచూస్తున్నారు. రెండు మూడ్రోజులుగా 'ఆర్య-2', 'సలీమ్' చిత్రాల ప్రదర్శనలను తెలంగాణ జిల్లాల్లో నిలిపివేస్తుండటంతో ఆ చిత్రాల బాక్సాఫీస్ రిజల్ట్ కు పురిట్లోనో (విడుదలైన తొలినాళ్లలోనే) గండిపడింది. ఈ పరిణాలతో విడుదలకు సిద్ధంగా ఉన్న ఎన్టీఆర్ 'అదుర్స్' చిత్రం డిసెంబర్ లో వెలుగు చూస్తుందా అనేది ప్రస్తుతం సినీ సర్కిల్స్ ప్రధాన చర్చనీయాంశమవుతోంది. ఈ ఏడాది ఇంతవరకూ 'అరుంధతి', 'కిక్ 'మగధీర' వంటి సూపర్ హిట్ చిత్రాలు, అతి స్వల్పంగా యావరేజ్ లు మినహాయిస్తే మిగతావన్నీ ఫ్లాపులే. ఈ క్రమంలో ఈ ఏడాది తెలుగు పరిశ్రమ మార్కెట్ స్టామినా చాటుతూ... 'మగధీర' రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉన్న చిత్రంగా ఎన్టీఆర్ 'అదుర్స్' చిత్రం ఫోకస్ అయింది. క్రిస్మస్ కానుకగా ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా సుమారు 1000 ప్రింట్లతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే ఇవాల్టి తాజా రాజకీయ సంక్షుభిత పరిస్థితుల్లో 'అదుర్స్'తో సహా ప్రముఖ హీరోల చిత్రాలు వేటినీ రిలీజ్ చేయకపోవడమే మంచిదనే అభిప్రాయం ఇండస్ట్రీ ప్రముఖులలో బలంగా వినిపిస్తోంది.
యూత్ లో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్, అలాగే అగ్ర హీరోల సినిమాలకు వచ్చే బాక్సాఫీస్ ఆదాయంలో నైజాం ఏరియా వాటా గణనీయంగా ఉండటంతో 'అదుర్స్' చిత్రం నైజాం ఏరియా రైట్స్ ను 11 కోట్లకు అమ్మారు. నిర్మాతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని సైతం ఈనెల 25న సినిమా రిలీజ్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్లకు తెలియజేయడంతో కొద్దిరోజులుగా సందడి కూడా మొదలైంది. ఈ క్రమంలో సినిమా రిలీజ్ పై వినాయక్ ను సంప్రదించినప్పుడు 'రిలీజ్ చేయాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. మరో రెండు రోజుల్లో ఏ విషయం తెలియజేస్తాం' అని చెప్పారు. పరిశ్రమకు చెందిన 24 క్రాఫ్ట్ ల ప్రతినిధులు కూడా ఒకటి రెండు రోజుల్లోనే సమావేశమై భవిష్యత్ కార్యాచరణ కూడా ప్లాన్ చేయబోతున్నారు. ఆ తర్వాతే 'అదుర్స్' రిలీజ్ ప్రకటన ఉంటుందనుకోవచ్చు.
Read 3 Comment(s) posted so far on this News / Article!
|