మళ్లీ నిర్మాతగా సుధాకర్
హీరోగా తమిళంలో 50 సినిమాలు చేసిన తర్వాత తెలుగులోకి అడుగుపెట్టి పలు సపోర్టింగ్ క్యారెక్టర్ల అనంతరం చివరకు కమెడియన్ గా సెటిలైన నటుడు సుధాకర్. అలా ఎందుకు జరిందని అడిగితే 'అదే డెస్టినీ...' అని నవ్వుతూ చెబుతుంటారాయన. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపు 600 చిత్రాల్లో ఆయన నటించారు. చిరంజీవితో 'ఊరికిచ్చిన మాట', కృష్ణతో 'భోగిమంటలు' చిత్రాలు నటుడిగా ఆయనకు మంచిపేరు తెచ్చినవే. కమెడియన్ గా ఇటీవల కాలంలో దాదాపు కనుమరుగైన (కొన్ని సినిమాలు వెలుగుచూడకపోవడం కారణం కావచ్చు) సుధాకర్ చాలా గ్యాప్ తర్వాత మరోసారి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు.
సుధాకర్ గతంలో డైనమిక్ ప్రొడక్షన్స్ పతాకంపై తన మిత్రులైన నటులు హరిప్రసాద్, నారాయణరావుతో కలిసి చిరంజీవి కథానాయకుడుగా 'యముడికి మొగుడు' అనే సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత క్రమంలో రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడుగా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో 'పరుగో పరుగు' చిత్రాన్ని తీశారు. పలు కారణాల వల్ల విడుదలలో జాప్యం జరిగి ఆ తర్వాత బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూసింది. ఇప్పుడు మరోసారి సుధాకర్ తన సమర్పణలో ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు చంద్ర సిద్ధార్ధ సోదరుడు నరేష్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. దీనిపై సుధాకర్ మాట్లాడుతూ, నరేష్ చెప్పిన కథ తననెంతో ఆకట్టుకుందనీ, ఓ హిట్ చిత్రానికి కావలసిన అన్ని అంశాలు ఇందులో ఉండటంతో ఆయన దర్శకత్వంలోనే ఈ చిత్రం ప్రారంభించనున్నట్టు చెప్పారు. త్వరలోనే నటీనటులు, ఇతర టెక్నీషియన్ల వివరాలు తెలియజేస్తామని అన్నారు. నిర్మాతగానే కాక...ఇదే ఊపులో నటుడిగా కూడా సుధాకర్ కొత్త అవకాశాలతో బిజీ అవుతారేమో చూడాలి.
Be first to comment on this News / Article!
|