రెండో సినిమాకే కోటిన్నర!
గ్లామర్ నటిగా యువత హృదయాలను గిలిగింతలు పెడుతున్న ఇలియనా మూడేళ్ల నిరీక్షణ ఫలించినట్టే ఉంది. అప్పట్లో 'కేడీ' చిత్రంతో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇలియనా ఆ చిత్రం ఫెయిల్ అయిన తర్వాత మళ్లీ అటువైపు తొంగిచూడలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్, సూర్య, విజయ్ వంటి హీరోలతో నటించే అవకాశం వచ్చినా వదులుకుంది. ఎట్టకేలకు ఇలియానా తన బెట్టు సడలించుకుని హీరో విక్రమ్ సరసన '24' అనే తమిళ చిత్రానికి అగ్రిమెంట్ చేసుకుంది. ఇందుకోసం ఇలియానా అక్షరాలా కోటిన్నర రూపాయలు తీసుకోనుందట. దీంతో ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ ఇంత పెద్ద మొత్తం అందుకోబుతున్న తొలి హీరోయిన్ రికార్డు ఇలియానా దక్కించుకోనుంది.
విక్రమ్ కథానాయకుడుగా విక్రమ్ కె.కుమార్ ('13 బి' ఫేమ్) దర్శకత్వంలో ఈ కొత్త చిత్రం తెరకెక్కబోతోంది. రొమాన్స్, యాక్షన్, ఫాంటసీ వంటి అంశాలు మేళవించిన ఫిక్షన్ సినిమా కావడం, ఇందులో హీరోయిన్ కు మంచి ప్రాధాన్యం ఉండటంతో హీరో విక్రమ్ పట్టుబట్టి మరీ ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇలియానాకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండటంతో నిర్మాతలు కూడా ఆమె కోరిన పారితోషికం ఇచ్చేందుకు ఒప్పుకున్నారట. ఇలియానా తమ సినిమాకు అగ్రిమెంట్ చేసిన విషయాన్ని దర్శకుడు విక్రమ్ కుమార్ ధ్రువీకరించారు. ఫిబ్రవరిలో జరిగే సెకెండ్ షెడ్యూల్ లో ఇలియానా పాల్గొనబోతోందని, పెద్దమొత్తంలో డేట్స్ ఇచ్చిందనీ ఆయన తెలిపారు. ఇలియానా పూర్తి స్థాయి నటి అనీ, అందం, గ్లామర్ తో పాటు పోటీపడి నటించే తత్వం ఆమె సొంతమనీ ఆయన కితాబిచ్చారు. ఇంత అందమైన అమ్మాయిని కూడా ఇంతవరకూ తాను చూడలేదని, విక్రమ్-ఇలియానా జంట సినిమాకే ఓ హైలైట్ అవుతుందనీ ఆయన చెబుతున్నారు. హీరో విక్రమ్ సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. తాను నటిస్తున్న తొలి ఫాంటసీ చిత్రం '24' అనీ, ఈ చిత్రానికి ఇలియానా కరెక్ట్ ఛాయెస్ అనీ, ఇద్దరూ అద్భుతమైన పాత్రలు పోషిస్తున్నామనీ ఆయన ఎంతో ఎగ్జయిటింగ్ గా చెప్పారు. ఇలియానా తెలుగులో నటించిన 'సలీమ్' చిత్రం ఇటీవలే విడుదల కాగా, కొత్తగా ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించనున్న కొత్త చిత్రానికి మాత్రమే కమిట్ అయింది.
Be first to comment on this News / Article!
|