'7 ప్రేమ కథలు' రెడీ...
ప్రేమకథలలో నవ్యతను ఆస్వాదించేందుకు ప్రేక్షకులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. 7 హిల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై శియా గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం '7 ప్రేమ కథలు'. ఈ చిత్రానికి సురేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తొలికాపీ సిద్ధమైంది.
'ప్రేమ అనేది ప్రతీ మనిషిలో ఓ తీయటి అనుభూతిని కలిగిస్తుంది. అయితే కొందరు ప్రేమలో గెలిస్తే, మరికొందరు ప్రేమ జ్ఞాపకాలతో గడిపేస్తారు. తొలి చూపులో ప్రేమ, త్యాగం, విరహం, సంఘర్షణ, స్పర్శ, బంధం...అనే ఏడు గుణాలనే ఏడు ప్రేమకథలుగా మలిచాం. అదే ఈ చిత్రం. తొలి కాపీ సిద్ధమైంది' అని నిర్మాత ఇనగడప సతీష్ కుమార్ తెలిపారు. తెలుగు చలన చిత్ర చరిత్రలో మొట్టమొదటి సారిగా ఏడు ప్రేమ కథల్ని ఒకే చిత్రంలో చూపించడం ఓ వైవిధ్యమైన ప్రయోగమని దర్శకుడు సురేష్ తెలిపారు. ఈ ఏడు కథలు ప్రతీ యువతీ యువకుల మనోభావాలకు అతి దగ్గరగా ఉంటాయన్నారు. సకుటుంబ సపరివార సమేతకంగా చూడదగిన చిత్రమిదని సహనిర్మాత రవికుమార్ పనస తెలిపారు. ఇంతవరకూ వచ్చిన ప్రేమ చిత్రాలకు భిన్నంగా ఏడు కొత్త కోణాలతో దీనిని మలిచామన్నారు. ప్రేమ అనే భావోద్వేగాలకు లోనవుతున్న యువతకు ఈ చిత్రం ఓ మంచి సందేశం ఇస్తుందన్నారు. తొలుత ఈ చిత్రానికి అనుకున్న 'ఫ్రూట్ సలాడ్' టైటిల్ ను ఇప్పుడు '7 ప్రేమ కథలు'గా మార్చారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో శ్రీనివాస్, విశ్వ, సూర్య, బ్రహ్మాజీ, శంకర్ గౌడ్, సురభి ప్రభు, సోనా నియోగి తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఓం ప్రకాష్ మార్తా మాటలు, అశోక్ తేజ్, మాచవరం ప్రవీణ్, సిరాశ్రీ పాటలు, ఎ.ఎం.విజయ్ సినిమాటోగ్రఫీ, సత్యా వై సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|