'నేను-లగడపాటి'
రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచలనం. తెలంగాణ, సమైక్య ఆంధ్ర ఆందోళనలు రోజురోజుకూ వేడెక్కుతున్న నేపథ్యంలో రాజకీయాలతో ప్రమేయం ఉన్న చిరంజీవి, మోహన్ బాబు, హరికృష్ణ వంటి సినీ నటులు మినహా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులెవరూ తమ అభిప్రాయాలతో బాహాటంగా ముందుకు రాలేదు. ఈ తరుణంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తొలిసారి ఈ అంశంపై గళం విప్పారు. 'ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని లగడపాటి రాజ్ గోపాల్ బలంగా నమ్ముతున్నారంటే నేను కూడా నమ్ముతున్నాను' అని వ్యాఖ్యానించారు. వర్మ తన సొంత బ్యాగ్ లో తన అభిప్రాయాలను పొందుపరచారు.
వర్మ, లగడపాటి విజయవాడ సిద్దార్ధ కాలేజీలో చదువుకున్నారు. లగడపాటికి వర్మ సీనియర్ కూడా. లగడపాటితో కాలేజీలో తనకున్న అనుబంధాన్ని వర్మ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాలేజీ ఎన్నికలో ఒకసారి లగడపాటి పోటీ చేశారనీ, ఎందుకు ఎన్నికల్లో దిగుతున్నావని అడిగినప్పుడు ప్రజలకు సేవ చేయాడానికి పదవులు అక్కర్లేదనీ, అయితే పదవిలో ఉంటే ప్రజలకు మరింత అందుబాటులోకి ఉండవచ్చని ఆరోజు లగడపాటి తనతో అన్నారని పేర్కొన్నారు. ఆయనలోని స్పష్టతకు తాను ఆశ్యర్యపోయానని అన్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయనాయకుడుగా ఉన్నత పదవుల్లోకి రావడం తనకెంత మాత్రం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి లగడపాటి నడుం బిగించడం తాను టీవీల్లో చూశాననీ, 25 ఏళ్లనాటి లగడపాటి తాను చూసినట్టు అనిపించి ఆ జ్ఞాపకాలు కళ్లముందుకు వచ్చాయని అన్నారు. లగడపాటి కళ్లలో అదే నిజాయితీ, ధైర్యం, అదే దృఢ వైఖరి తనకు ద్యోతకమైందని అన్నారు. 'తెలంగాణ, సమైక్యాంధ్ర, రాజకీయాలు గురించి నాకు తెలియదు. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. సమైక్యాంధ్రగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని లగడపాటి ప్రగాఢంగా విశ్వసిస్తుంటే...దానిని నేను కూడా నమ్ముతున్నాను' అంటూ వర్మ స్పష్టం చేశారు.
Be first to comment on this News / Article!
|