మెరీనా తీరంలో నాగచైతన్య
ఈ ఏడాది 'జోష్' చిత్రంతో యువతరం హీరోగా పరిచయమైన నాగచైతన్య ఈసారి నవ్యరీతిలో సాగే ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. దీనికి గౌతమ్ మీనన్ దర్శకుడు. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో ఇందిర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగచైతన్యకు జోడిగా కొత్తమ్మాయి సుమంత పరిచయమవుతోంది. న్యూయార్, కేరళలో కీలకమైన షూటింగ్ జరుపుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలోని మెరీనా తీరంలో చురుగ్గా షూటింగ్ జరుపుకొంటోంది.
మెరీనా బీచ్ లో వారం రోజుల పాటు షూటింగ్ షెడ్యూల్ జరుగుతుందనీ, అనంతరం హైద్రాబాద్ లో షూటింగ్ ఉంటుందనీ గౌతమ్ మీనన్ తెలిపారు. ఇదొక వెరైటీ లవ్ స్టోరీ అనీ, నాగతైన్యకు ఎలాంటి కథ కరెక్టో అలాంటి కథతో ఈ చిత్రాన్ని ఎంతో బాధ్యతాయుతంగా తెరకెక్కిస్తున్నామనీ చెప్పారు. ప్రేమ కథలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. అనంత్ శ్రీరామ్ చక్కటి సాహిత్యం అందించారని తెలిపారు. అక్కినేని అభిమానులకు ఈ చిత్రం విందు భోజనంలాటిందని చెప్పారు. ఈ చిత్రానికి 'నువ్వే మాయ చేశావో గానీ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇతర పాత్రల్లో కృష్ణుడు, దేవన్, సురేఖావాణి, లక్ష్మి, సుధీర్, త్రిష ఎలెక్స్ తదితరులు నటిస్తున్నారు. ఉమర్జీ అనూరాధ మాటలు, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|