యూత్ లో పవన్ కల్యాణ్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన చివరిసారిగా నటించిన 'జల్సా' చిత్రం 2 ఏప్రిల్ 2008లో విడుదలైంది. ఆ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న 'పులి' చిత్రంలో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం నాయకుడుగా పవన్ గత ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం, ఇతరత్రా కారణాల వల్ల షూటింగ్ లో జాప్యం తలెత్తి ఇప్పుడు స్పీడ్ అందుకుంది. దీంతో ఈ ఏడాది పవన్ కల్యాణ్ ఖాతా కూడా తెరుచుకోలేదు.
యువహీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ సైతం ఈ ఏడాది ముఖం చాటేశారు. ఆయన చివరిసారిగా నటించిన 'కంత్రీ' చిత్రం 9 మే 2008న విడుదలైంది. ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'అదుర్స్' చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలలో జాప్యం జరుగుతోంది. ఆమధ్యన ఎన్టీఆర్ కు యాక్సిటెంట్ జరగడంతో షూటింగ్ వాయిదా పడి ఆ తర్వాత ఆయన కోలుకోవడంతో సినిమా నిర్మాణం పూర్తయింది. నిజానికి ఈ డిసెంబర్ 25న సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సినిమా రిలీజ్ కొత్త సంవత్సరం జనవరికి మళ్లింది. ఇక హీరో నాగార్జున డిసెంబర్ రిలీజ్ సెంటిమెంట్ కు ఈసారి గండి పడటంతో ఒక్క సినిమా కూడా ఈ ఏడాది విడుదల కాని హీరోల్లో ఆయన కూడా చేరారు. నాగార్జున గత చిత్రమైన 'కింగ్' 24 డిసెంబర్ 2008న విడుదలైంది. ప్రస్తుతం ఆయన శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న 'కేడీ'లో నటిస్తున్నారు. షరామామూలుగా డిసెంబర్ లోనే ఈ చిత్రం రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగినప్పటికీ ఇప్పుడు జనవరికి మళ్లింది. ఈ విధంగా ఈ నలుగురు హీరోలు 2009కు నీరసంగానే వీడ్కోలు చెప్పి తమ అభిమానులను నిరాశపరచారు.