యువతరం కలల హాసినిగా పేరు తెచ్చుకుని బాలీవుడ్ లోనూ ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటున్న జెనీలియా తన బాయ్ ఫ్రెండ్ రితీష్ దేశ్ ముఖ్ ను ఈ ఏడాదే పెళ్లాడనుందంటూ బాలీవుడ్ మ్యాగజైన్ ఓ వార్తా కథనం ప్రచురించింది. ఆరేళ్ల క్రితం 'తుజే మేరి కసమ్' షూటింగ్ సమయంలో ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన ప్రేమకు ఈ ఏడాది పెళ్లితో శుభం కార్డు పడనుందంటూ ఆ పత్రిక పేర్కొంది. రితీష్ తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలిపింది. షరామామూలుగా ఈ వార్తను జెనీలియా బుధవారంనాడు ఓ ప్రకటనలో ఖండించింది. ఇప్పటికిప్పుడు తాను ఎవర్నీ పెళ్లి చేసుకునేలేదని స్పష్టం చేసింది.
'సూటిగా చెప్పాలంటే నేను ఎవర్నీ పెళ్లి చేసుకోబోవడం లేదు. నా వ్యక్తిగత జీవితం గురించి ముచ్చటించడానికి నేను ఎప్పుడూ ఇష్టపడను. ఇలాంటి వార్తల వల్ల నా కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపకూదనే ఉద్దేశంతోనే ఇప్పుడు వివరణ ఇవ్వాల్సి వస్తోంది. ప్రస్తుతం సినిమాలు, ఒప్పుకున్న బ్రాండ్ ల పైనే నా దృష్టి ఉంది. వాటికి దూరంగా ఉండాలనుకోవడం లేదు. ఒకవేళ పెళ్లితో స్థిరపడాలని అనుకుంటే నేనే స్వయంగా ఆ విషయం మీకు తెలియజేస్తాను' అని జెనీలియా స్పష్టం చేసింది. ప్రస్తుతం జెనీలియా దృష్టంతా ఈనెల 15న విడుదలకు సిద్ధంగా ఉన్న 'ఛాన్స్ పే డాన్స్' పైనే ఉంది. ప్రస్తుతం ఆ చిత్రం ప్రమోషన్ వర్క్ లో ఆమె బిజీగా ఉంది. మరోవైపు తెలుగులో రామ్ చరణ్ సరసన 'ఆరంజ్' చిత్రంలోనూ జెనీలియా హీరోయిన్ గా నటిస్తోంది.