తెలుగు సినీ పరిశ్రమకు 'ప్రాంతీయ' సెగ సోకడంతో తీవ్రంగా నష్టపోయిన 'ఆర్య 2' చిత్రం ఈనెల 8న తిరిగి నైజాంలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రదర్శనను తెలంగాణ ఉద్యమకారులు ఇటీవల అడ్డుకుని పలుచోట్ల సినిమా రీళ్లు, కటౌట్లు ధ్వసం చేశారు. చిరంజీవి సమైక్యాంధ్రకు కట్టుబడినట్టు ప్రకటించిన నేపథ్యంలో ఆయన కుటుంబానికి చెందిన హీరోల సినిమాలు ఆడనిచ్చేది లేదంటూ ఉద్యమకారులు కన్నెర్ర చేశారు. దీంతో నాలుగు వారాల పాటు నిరీక్షించిన చిత్ర నిర్మాత ఆదిత్య బాబు నైజాం ఏరియాలో ఇటీవలే ఆ చిత్ర ప్రదర్శనను ఆపేసి బాక్సులను వెనక్కి తెప్పించారు. పరిస్థితి సానుకూలమైన వెంటనే సినిమా మళ్లీ విడుదల చేస్తామని చెప్పిన నిర్మాత ఇప్పుడు సంక్రాంతి సీజన్ ను దృష్టిలో పెట్టుకుని నైజాం ఏరియాలో మళ్లీ రీ రిలీజ్ కు సిద్ధపడుతున్నారు. ఈనెల 8న ఈ చిత్రాన్ని హైద్రాబాద్ లో తిరిగి ప్రదర్శించనున్నారు.
సంక్రాంతి సీజన్ వసూళ్లకు అనుకూలమే అయినా ఇప్పటికే నష్టపోయిన 'ఆర్య-2' ఈ పరిస్థితిని ఎలా క్యాష్ చేసుకుంటుందనేది ప్రశ్నార్ధకమే. సినీ పరిశ్రమకు తాము వ్యతిరేకం కాకపోయినా తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించే వారి సినిమాలను అడ్డుకుంటామని తెలంగాణ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి) మరోసారి స్పష్టం చేసింది. దీనికి తోడు ఇప్పటికే 'ఆర్య 2' పైరసీ సీడీలు దొడ్డిదారిన వచ్చి చేరారు.