నాగ్ ము మ్ము మ్ముద్దంటే...
హీరో నాగార్జున తన వారసుడుగా నాగచైతన్యను పరిశ్రమకు అందించినప్పటికీ ఇప్పటికే తానే యువసామ్రాట్ అనిపించుకున్నారు. వయసు పెరుగుతున్నా గ్లామర్ చెక్కుచెదరక పోవడం ఆయనలోని ప్రత్యేకత. ఇప్పుడు 'కేడీ' చిత్రం ద్వారా నెగిటివ్ టచ్ ఉన్న హీరో పాత్రలో నాగార్జున మరోసారి తన అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందులో భాగంగానే తన తండ్రి ఎ.ఎన్.ఆర్.ను మరోసారి స్ఫురణకు తెస్తూ అలనాటి ఎఎన్ఆర్ క్లాసింగ్ సాంగ్ ను ఇప్పుడు 'కేడీ'లో రీమిక్స్ చేయబోతున్నారు. అక్కినేని నటించిన 'అదృష్టవంతులు' చిత్రంలోని 'ము...మ్ము...మ్ముద్దంటే చేదా..ఇపుడా ఉద్దేశం లేదా' అనే పాట అప్పట్లో పెద్ద హిట్. ఇప్పటికీ ఎవర్ గ్రీనే. ఇదే పాటను ఇప్పుడు 'కేడీ' చిత్రంలో నాగార్జున, బాలీవుడ్ భామ మహెక్ ఛాహల్ పై చిత్రీకరించబోతున్నారు. దీనికి సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు.
నాగార్జున కొద్దికాలం క్రితం 'నేనున్నాను' చిత్రంలో 'ఎట్టాగ ఉన్నాది ఓలమ్మీ' అనే ఎఎన్ఆర్ రీమిక్స్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించారు. దశాబ్దం తర్వాత మళ్లీ 'కేడీ' చిత్రం కోసం ఆయన రీమిక్స్ చేస్తున్నారు. ఇందులో నాగార్జున పాత్ర మనుషుల్ని మాయ చేసేలా ఉంటుంది. గాంబ్లింగ్, కార్య దొంగతనాల నేపథ్యంలో కథ నడుస్తుంది. ఎంటర్ టైన్ మెంట్ తో కథ ప్రారంభమై సీరియస్ తరహాలోకి మళ్లుతుంది. కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత శివప్రసాద్ తమ సంస్థ రజతోత్సవ కానుకగా ఈనెల రెండో వారంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాగార్జునకు జోడిగా మమతా మోహన్ దాస్, మరో కీలక పాత్రలో అమెరికా అమ్మాయి లిండా, ప్రధాన పాత్రల్లో అంకుర్ ('స్లమ్ డాగ్ మిలయనీర్' ఫేమ్), నిర్మల్ పాండే ('బండిట్ క్వీన్'), అఖిలేంద్ర మిశ్రా ('లగాన్'), 'డాన్' విలన్ కెల్లీడార్జ్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, హర్షవర్దన్, తనికెళ్ల భరణి నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం అందిస్తున్నారు. చంద్రబోస్-కృష్ణ చైతన్య పాటలు, సెల్వ ఫైట్స్, సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ, శ్రమణ్ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|