'రుద్రమదేవి' కథేంటి?
రాణి రుద్రమ దేవి గురించి తెలియని తెలుగువారు ఉండరు. పౌరుష ప్రతాపాలకు పెట్టింది పేరైన కాకతీయ సామ్రాజాన్ని ఏలిన వీరనారి రుద్రమ దేవి. వెండితెరపై ఈ పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు సీనియర్ నటి విజయశాంతి ఇప్పుడు నడుం బిగించారు. విజయశాంతిని ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత క్రమంలో అగ్రస్థాయి హీరోయిన్ గా పరిశ్రమలోని ప్రముఖ హీరోలందరితోనూ నటించి దశాబ్దం పాటు వెండితెరను ఏలారు. 'కర్తవ్యం', 'ప్రతిఘటన' వంటి పలు చిత్రాలతో 'లేడీ అమితాబ్' ఇమేజ్ ను తెచ్చుకున్న విజయశాంతి ఆ తర్వాత క్రమంలో వెనకబడ్డారు. ఆమెకు వచ్చిన ఇమేజే ఇందుకు కారణం అంటారు. దీంతో కొత్త హీరోలతో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అవి సక్సెస్ కు నోచుకోలేదు. 'ఓసేయ్ రాములమ్మా' చిత్రం మళ్లీ ఆమెకు బ్రేక్ ఇచ్చినా ఆ తర్వాత మళ్లీ చేతిలో సినిమాలు లేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి 'రాణి రుద్రమ దేవి' చిత్రాన్ని విజయశాంతి అనౌన్స్ చేశారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఇంతవరకూ సినిమాల ఊసెత్తని రాములమ్మ ఇప్పుడు మళ్లీ ముఖానికి మేకప్ వేసుకునేందుకు సిద్ధపడటం వెనుక ఆమె ఆలోచన ఏమై ఉంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చనీయాంశమవుతోంది.
డెభ్బై ఐదేళ్లకు పైబడిన చిత్ర పరిశ్రమకు ఇటీవల 'ప్రాంతీయ' సెగలు సోకాయి. తెలంగాణను సమర్ధించని ఆంధ్ర హీరోలు, నిర్మాతలు, దర్శకుల చిత్రాలను బాయ్ కాట్ చేస్తామని తెలంగాణ విద్యార్థి సంఘాల ఐక్య వేదిక స్పష్టమైన ప్రకటన ఇవ్వడం, తెలంగాణ ఉద్యమకారులు కొన్ని షూటింగ్ లపై దాడులు నిర్వహించడంతో సినీ ఫీల్డ్ 'డివైడ్' కానుందనే సంకేతాలు కనిపించాయి. తెలంగాణా డివైడ్ అయితే పారలల్ సినీ ఫీల్డ్ ఏర్పడవచ్చనే అభిప్రాయాలూ కొందరిలో ఉన్నాయి. తాను తెలంగాణ బిడ్డనని ఎప్పుడో ప్రకటించిన విజయశాంతి అందువల్లే తనకు అవకాశాలు ఇవ్వడం లేదని గుర్రుగా ఉన్నారట. ఈ క్రమంలో మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవడం వల్ల తన సినిమాలకు మంచి గిరాకీతో పాటు ఎప్పుడూ లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంటుందని విజయశాంతి ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ హీరో నితిన్ వైపు పలువురు నిర్మాతలు దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో రాములమ్మ కూడా 'రుద్రమ దేవి'గా బరిలోకి దూకుతున్నారు. టైటిల్ పాత్రను ఆమె పోషించనున్నారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనిని స్వయంగా ఆమె నిర్మించబోతున్నారు కూడా. మరి నటీనటులు, టెక్నీషియన్లను ఎక్కడ్నించి దిగుమతి చేసుకుంటారో చూడాలి.
Be first to comment on this News / Article!
|