తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ త్వరలోనే పెళ్లి పీటల మీద కూర్చోనుందని సినీ విశ్వసనీయ వర్గాల సమాచారం. చెన్నైకి చెందిన ప్రముఖ బిజినెస్ మాగ్నెట్ రామ్ కుమార్ తనయుడైన అశ్విన్ ను సౌందర్య వివాహం చేసుకోనుంది. సౌందర్యకు చెందిన సినీ నిర్మాణ సంస్థ అయిన ఓచర్ పిక్చర్స్ ప్రొడక్షన్ కు చెందిన అత్యున్నత వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. చెన్నైలో ఫిబ్రవరి 14న వివాహ నిశ్చితార్ధం నిరాడంబరంగా జరుగనుందని తెలుస్తోంది.
'లవ్ కమ్ ఎరేంజ్ మ్యారేజ్ ఇది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు ఈ వివాహాన్ని నిశ్చయించారు. త్వరలోనే పెళ్లి తేదీని కూడా ప్రకటించనున్నారు' అని ఆ వర్గాలు తెలిపాయి. సౌందర్య సోదరి ఐశ్వర్య కొద్దికాలం క్రితమే హీరో ధనుష్ ను పెళ్లాడింది. అయితే సినీ నేపథ్యం లేని వ్యక్తికే సౌందర్య ప్రాధాన్యం ఇచ్చారట. సౌందర్య ప్రస్తుతం ఓచర్ పిక్చర్స్ బ్యానర్ పై రజనీకాంత్ తో 'సుల్తాన్ ది వారియర్' అనే యానిమేషన్ చిత్రాన్ని కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. తమిళంలో ఆమె నిర్మిస్తున్న 'గోవా' చిత్రం కూడా త్వరలోనే విడుదల కానుంది.