సంక్రాంతికి 'కేడీ' దూరం!
యువసామ్రాట్ నాగార్జున 'కేడీ' చిత్రం ఈసారి సంక్రాంతి సీజన్ కు సైతం విడుదలకు నోచుకోవడం లేదు. నాగార్జునకు సెంటిమెంట్ గా బాగా కలిసొచ్చిన డిసెంబర్ కు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ కారణాంతరాల వల్ల సంక్రాంతి సీజన్ కు మళ్లింది. తాజాగా ఆ సీజన్ కూడా చేజారినట్టే. ఇది నాగార్జున అభిమానులకు నిరాశ కలిగించే విషయమే అయినా ప్రస్తుతం ఈ చిత్రం తుదిమెరుగుల దశలో ఉండటంతో పండుగకు రిలీజయ్యే అవకాశాలు లేవు. అయితే ఇదే నెలలో ఆడియో విడుదల చేసి ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ కు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
'కింగ్' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ ఈ చిత్రాన్ని తమ సంస్థ రజతోత్సవ కానుకగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అన్నపూర్ణా స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. నాగార్జున తన గత చిత్రాలకు భిన్నంగా విభిన్న షేడ్స్ ఉన్న పాత్రను ఇందులో పోషిస్తున్నారు. గాంబ్లింగ్, కార్ల దొంగతనాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఎంటర్ టైన్ మెంట్ తో కథ ప్రారంభమై సీరియస్ తరహాలోకి మళ్లుతుంది. కిరణ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నాగార్జున సరసన మమతా మోహన్ దాస్, మరో కీలక పాత్రలో అమెరికా అమ్మాయి లిండా నటిస్తున్నారు. నాగార్జున ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతా ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ చేసేందుకు పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఎఎన్ఆర్ క్లాసిక్ సాంగ్ 'ము మ్ము మ్ముదంటే చేదా' (అదృష్టవంతులు) పాటను ఇందులో రీమిక్స్ సాంగ్ గా అందిస్తున్నారు. ప్రధాన పాత్రల్లో అంకుర్ ('స్లమ్ డాగ్ మిలయనీర్' ఫేమ్), నిర్మల్ పాండే ('బండిట్ క్వీన్'), అఖిలేంద్ర మిశ్రా ('లగాన్'), 'డాన్' విలన్ కెల్లీడార్జ్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, హర్షవర్దన్, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం అందిస్తున్నారు. చంద్రబోస్-కృష్ణ చైతన్య పాటలు, సెల్వ ఫైట్స్, సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ, శ్రమణ్ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|