'యుగానికి ఒక్కడు' ఆడియో
కార్తీక్ (సూర్య సోదరుడు) కథానాయకుడుగా శ్రీరాఘవ (7/జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే ఫేమ్) దర్శకత్వంలో డ్రీమ్ వాలీ పతాకంపై ద్విభాషా చిత్రంగా 45 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం 'యుగానికి ఒక్కడు'. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో శుక్రవారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ఎస్.ఎస్.రాజమౌళి ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని మరో ముఖ్య అతిథి వి.వి.వినాయక్ కు అందజేశారు. చిత్ర సమర్పకుడు రవీంద్రన్, ఆర్య, స్వాతి, భోగవల్లి ప్రసాద్, ఎన్.వి.ప్రసాద్, డివివి దానయ్య, శానం నాగ అశోక్, శ్రీరాఘవ, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్, చిత్ర కథానాయిక రీమాసేన్, ఆండ్రియా, ఎంఎల్ కుమార్ చౌదరి, హీరో కార్తీక్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
రాజమౌళి మాట్లాడుతూ, 'మగధీర' షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్లినప్పుడు అక్కడ జైసెల్మేర్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరగడం, అలాగే హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ తాను చూశాననీ చెప్పారు. ఇటీవల కాలంలో ఇలాంటి అడ్వంచరస్ మూవీ రాలేదనీ, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననీ అన్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు సినిమా చూస్తానా అని ఉందని వినాయక్ అన్నారు. కార్తీక్ తమిళంలో ఒకే ఒక సినిమాతో చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నారనీ, ఈ సినిమా కూడా ఆయనకు మంచి సక్సెస్ ను అందించాలని కోరుకుంటున్నానని అన్నారు. శ్రీరాఘవ మాట్లాడుతూ, హైదారాబాద్ వస్తే తన సొంతింటికి వచ్చిన అనుభూతి పొందుతాననీ, చాలా రిస్క్ తీసుకుని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామనీ చెప్పారు. తెలుగులో తాను మూడు సినిమాలకు సంగీతం అందించాననీ, వాటిని విజయవంతం చేసినట్టే ఈ చిత్రాన్ని కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నట్టు జి.వి. ప్రకాష్ అన్నారు. హీరో కార్తీక్ మాట్లాడుతూ, ఇది తన తొలి తెలుగు చిత్రమనీ, దర్శకుడు ఈ చిత్రం కోసం మూడేళ్లు రీసెర్చ్ చేశారనీ, భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ చెప్పారు. తెలుగు ప్రేక్షకులు సూర్యను ఆదిరించినట్టే తనకు కూడా ఆదరించాలని కోరారు. యూనిట్ అంతా ఎంతో శ్రమించి అంకితభావంతో చేసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం తనకుందని చిత్ర సమర్పకుడు రవీంద్రన్ అన్నారు.
Be first to comment on this News / Article!
|