బెదరని 'అదుర్స్'
నిరీక్షణ పెరిగే కొద్దీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు చేతులు కాలిపోతాయి. ఎన్టీఆర్-వి.వి.వినాయక్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో రూపొందిన 'అదుర్స్' చిత్రం ఫిల్మ్ మేకర్స్ కొద్దిరోజులుగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ట్రైలర్స్ విడుదలై నెలరోజులు పైనే అయినా సినిమా థియేటర్లకు రాకపోవడంతో పంపిణీదారుల ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో క్రిస్మస్ సీజన్ వదులుకున్నప్పటికీ సంక్రాంతి సీజన్ వదలరాదని పంపిణీదారులు గట్టి పట్టు పట్టడంతో నిర్మాతలు ఈనెల 13న సినిమా రిలీజ్ కు నిర్ణయించారు. అత్యధిక ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే 11వ తేదీ నాటికి కూడా థియేటర్ల ప్రకటించకపోవడం
విశేషం..
తెలంగాణపై ఎన్టీఆర్ తన వైఖరి చెప్పేంతవరకూ 'అదుర్స్' సినిమా తెలంగాణలో ఆడనివ్వమంటూ కొద్దిరోజులుగా ఉద్యమకారులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఉద్యమం సద్దుమణిగినట్టే కనిపిస్తున్న తరుణంలో 'అదుర్స్' రిలీజ్ తేదీని నిర్మాతలు ప్రకటించారు. అయితే తెలంగాణపై తన వైఖరిని చెప్పని ఎన్టీఆర్ సినిమాను తెలంగాణలో ఆడనిచ్చేది లేదంటూ తెలంగాణ వర్శిటీల విద్యార్థి జెఎసి నాయకులు ఆదివారంనాడు మరోసారి తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రదర్శనకు ఎలాంటి అడ్డంకులు ఎదురైనా నిర్మాతలు భారీగానే నష్టపోవాల్సి రావచ్చు. ఎన్టీఆర్ కు మంచి పట్టున్న ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రం 'అదుర్స్' సందడి మొదలైంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో నయనతార, షీలా హీరోయిన్లుగా నటించారు. మహేష్ మంజ్రేకర్, సాయాజీ షిండే, నాజర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవల సెన్సార్ పూర్తయి క్లీన్ యు అందుకుంది.
Be first to comment on this News / Article!
|