సంక్రాంతి లెక్కలు తేలాయి!
సినిమా షూటింగ్ లపై దాడులు, థియేటర్లలో ప్రదర్శనల నిలిపివేత వంటి సంఘటనల మధ్య ఈసారి సంక్రాంతి సీజన్ లో ఏ చిత్రాలు బరిలో ఉండనున్నాయనే సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. 13వ తేదీన రెండు, 14న మరో రెండు...వెరసి 4 కొత్త చిత్రాలు సంక్రాంతి సందడి చేయబోతున్నాయి.ఎన్టీఆర్ 'అదుర్స్', మల్టీ స్టారర్ 'ఓం శాంతి' చిత్రాలు బుధవారం, వెంకటేష్ 'నమో వెంకటేశ' రవితేజ 'నాడోడిగల్' చిత్రాలు గురువారం విడుదల కానున్నాయి.
ఎన్టీఆర్ 'అదుర్స్' చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. 'ఆది', 'సాంబ' చిత్రాల తర్వాత ఎన్టీఆర్-వి.వి.వినాయక్ కాంబినేషనలో వస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రాన్ని కొడాలినాని-వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మించారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో నయనతార, షీలా గ్లామర్ అట్రాక్షన్ కానున్నారు. కథను నమ్ముకుని సక్సెస్ థీమాతో వస్తున్న చిత్రం 'ఓం శాంతి'. ఇటీవలే 'బాణం' చిత్రంతో అభిరుచిగల నిర్మాతగా అనిపించుకున్న చలసాని శేష ప్రియాంక ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రకాష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మల్టీస్టారర్ చిత్రంలో నవదీప్, నిఖిల్, కాజల్, బిందు మాధవి, అదితి శర్మ కీలక పాత్రలు పోషించగా, ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. సంక్రాంతికి సకుటుంబ సమేతంగా చూడదగిన హిలేరియస్ ఎంటర్ టైనర్ గా 'నమో వెంకటేశ' రూపొందింది. కెరీర్ లో 90 శాతం సక్సెస్ లు ఉన్న విక్టరీ వెంకటేష్ కథానాయకుడుగా వరుస హిట్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని అందిచండంతో సహజంగానే సినిమాపై మంచి అంచనాలున్నాయి. వెంకటేష్ తో 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' తర్వాత గ్లామర్ నటి త్రిష నటించడం, బ్రహ్మానందం పూర్తి నిడివి కామెడీ రోల్ పోషించడం హైలైట్స్. రవితేజ సైతం మల్టీస్టారర్ 'శంభో శివ శంభో' తో ఈ ఏడాది తొలి హిట్ ను ఆశిస్తున్నారు. అల్లరి నరేష్, శివబాలాజీ, సునీల్, ప్రియమణి తదితులు నటించిన ఈ చిత్రాన్ని సముద్ర ఖని దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించారు. తమిళనంలో గత ఏడాది సూపర్ డూపర్ హిట్టయిన 'నాడోడిగళ్' చిత్ర రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది.ఈ చతుర్ముఖ పోటీలో సంక్రాంతి విజేతలుగా ఏయే సినిమాలు నిలుస్తాయనేది త్వరలోనే తేలనుంది.
Be first to comment on this News / Article!
|