థియేటర్ల లిస్ట్ ఏదీ?!
సంక్రాంతి రిలీజ్ లకు సంబంధించి ఈసారి ఉన్నంత సస్పెన్స్ ఇంతకు ముందెన్నడూ సగటు సినీ ప్రేక్షకుడు చవిచూసి ఉండడు. ఫిల్మ్ మేకర్స్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. సహజంగా పండుగకు ఓ వారం రోజుల ముందు వరకూ పబ్లిసిటీ ఊదర కొట్టి థియేటర్ల జాబితా ఇవ్వడం రివాజు. ఆ వెంటనే అడ్వాన్స్ బుకింగ్ ల సందడి మొదలవుతుంటుంది. ఈ సంక్రాంతికి ఇప్పటికే 4 సినిమాల రిలీజ్ తేదీలు విస్పష్టంగా ప్రకటించినప్పటికీ ఎన్టీఆర్ 'అదుర్స్', వెంకటేష్ 'నమో వెంకటేశ' చిత్రాలకు సంబంధించిన థియేటర్ల జాబితా ఇంకా వెలుగు చూడలేదు. దీంతో నైజాం ఏరియాలో ముందుగా ప్రకటించన ప్రకారం అదుర్స్ (13), నమో వెంకటేశ (14) విడుదలపై కొద్దిపాటి అస్పష్టత నెలకొంది.
తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకుంటే రిలీజ్ లను అడ్డుకుంటామని తెలంగాణ వర్శిటీల విద్యార్థి జెఎసి నాయకులు పేర్కొనడంతో నైజాం ఏరియాలోని ఎగ్జిబిటర్లు (థియేటర్ల యాజమాన్యాలు) అయోమయంలో పడ్డారని వినిపిస్తోంది. నైజాంలో మాటెలా ఉన్నా ఆంధ్ర, సీడడ్ లో రిలీజ్ చేయకుంటే సంక్రాంతి సీజన్ జారిపోతుందని ఆయా ఏరియాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్లు సదరు నిర్మాతలపై ఒత్తిడిని పెంచుతున్నారు. ఆ ప్రకారం జరిగితే పైరసీ సీడీలు బయటకు వచ్చేసి నైజాం ఏరియాలో సినిమాకు భారీ నష్టం వాటిల్లవచ్చని నిర్మాతలు ఆవేదన చెందుతున్నారట. ఈ క్రమంలోనే ఇంకా నైజాం ఏరియాలో థియేటర్ల జాబితా విడుదల చేయలేదని తెలుస్తోంది. అయితే సంక్రాంతి రేసులో ఉన్న 'ఓం శాంతి', 'శంభో శివ శంభో' చిత్రాల థియేటర్లను ఇప్పటికే ప్రకటించడంతో పాటు అడ్వాన్స్ బుకింక్స్ మొదలు పెట్టారు. 'అదుర్స్', 'నమో వెంకటేశ' విషయంలో ఏర్పడిన అనిశ్చితికి మంగళవారం తెరపడవచ్చు.
Be first to comment on this News / Article!
|